Comedians as Heros

టాలీవుడ్‌లో ఎందరో హాస్యనటులు కొన్ని సినిమాల్లో కథానాయకులుగా నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. ఈతరం కమెడియన్లు సైతం హీరోలుగా కనిపించి సందడి చేశారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకొచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? చూద్దాం..
సుహాస్
లఘు చిత్రాలతో నటుడిగా కెరీర్ ప్రారంభించి, 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశారు సుహాస్ (Suhas). అందులో హీరో శర్వానంద్‌కు స్నేహితుడిగా నటించి, మెప్పించారు. ఆ తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాలతో నవ్వులు పంచారు. ‘కలర్ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్నారు. కొవిడ్ కారణంగా ఆ చిత్రం థియేటర్లలోకి రాకపోయింది. నేరుగా ఓటీటీ ‘ఆహా’ వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాతా కొన్ని చిత్రాల్లో కామెడీ పండించారు. ‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)లో కథానాయకుడిగా మెప్పించారు. ‘కేబుల్ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
ప్రియదర్శి
‘మల్లేశం’తో కథానాయకుడిగా మెప్పించిన కమెడియన్ ప్రియదర్శి (Priyadarshi Pulikonda). గతేడాది విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న ‘బలగం’ (Balagam), ‘మంగళవారం’ (Mangalavaaram)లో ఆయన ప్రధాన పాత్రలు పోషించి, అలరించారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యారు.
వైవా హర్ష
షార్ట్‌ఫిల్మ్స్ నుంచి వెండితెరపైకి వచ్చిన వారిలో వైవా హర్ష (Harsha Chemudu) ఒకరు. ఆయన కథానాయకుడిగా రూపొందిన తొలి చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై, అలరించింది. ‘మసాలా’తో సినీ కెరీర్ ప్రారంభించిన హర్ష ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్’, ‘పక్కా కమర్షియల్’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పంచారు.
అభినవ్ గోమఠం
తక్కువ చిత్రాల్లోనే నటించినా యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అభినవ్ గోమటం (Abhinav Gomatam). ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా..’ (mast shades unnai ra) అనే డైలాగ్‌తో పాపులర్ అయి, అదే టైటిల్‌తో తెరకెక్కిన సినిమాలో హీరోగా నటించారు. ఈ ఫిబ్రవరిలో విడుదలైందీ చిత్రం. ఈయన కూడా లఘు చిత్రాల్లో ప్రతిభ కనబరిచి ఇండస్ట్రీలోకి వచ్చారు. ‘మళ్లీరావా’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తదితర మూవీస్‌లో కమెడియన్‌గా వినోదం పంచారు.
వెన్నెల కిశోర్
తొలి ప్రయత్నంలోనే విశేష క్రేజ్ సొంతం చేసుకుని సినిమా టైటిల్ ‘వెన్నెల’ను ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు కిశోర్ (Vennela Kishore). ‘దూకుడు’, ‘జులాయి’ వంటి హిట్ చిత్రాలతో గిలిగింతలు పెట్టిన ఆయన ‘అతడు ఆమె ఓ స్కూటర్’తో కథానాయకుడిగా మారారు. మళ్లీ కమెడియన్‌గా నటిస్తూనే కొంత గ్యాప్ తర్వాత ‘ఎలుకా మజాకా’లో ప్రధాన పాత్ర పోషించారు. దాదాపు తొమ్మిదేళ్ల అనంతరం ‘చారి 111’ (Chari 111)తో హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు. మధ్యలో ‘గీత గోవిందం’, ‘ఎఫ్ 2’, ‘చిత్రలహరి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘బ్రో’, ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’ తదితర సినిమాల్లోని కీలక పాత్రలతో ఎంటర్‌టైన్ చేశారు.
సుడిగాలి సుధీర్
‘జబర్దస్త్’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్ ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన ఆయన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’తో హీరో అయ్యారు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్ సహస్ర’లో ప్రధాన పాత్ర పోషించారు. ‘జి.ఒ.ఎ.టి’తో అలరించేందుకు సిద్ధయ్యారు.
వీరు ఇలా..
‘మా ఊరి పొలిమేర’ (Maa Oori Polimera)లో ప్రధాన పాత్ర పోషించి థ్రిల్ పంచిన నటుడు సత్యం రాజేశ్ (Satyam Rajesh). కొవిడ్ కారణంగా నేరుగా ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సినిమా విశేష స్పందన దక్కింది. దీంతో, దానికి సీక్వెల్‌గా రూపొందించిన ‘మా ఊరి పొలిమేర 2’ను గతేడాది చివరిలో థియేటర్లలో రిలీజ్ చేశారు. ‘బుజ్జీ ఇలారా..’లో ప్రధాన పాత్రధారిగా నటించి మెప్పించిన ధనరాజ్ (Dhanraj) ప్రస్తుతం.. ‘రామం రాఘవం’లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తనే దర్శకత్వం వహిస్తుండడం విశేషం. సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందుతోందీ చిత్రం.