Censor board emergency meeting – సెన్సార్ బోర్డు అత్యవసర సమావేశం..!

సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (Central Board of Film Certification) ముంబయి కార్యాలయంలో అవినీతి జరుగుతోందంటూ నటుడు విశాల్ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం రోజురోజుకూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్రం కూడా స్పందించింది. తాజాగా దీనిపై సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విశాల్ ఆరోపణలపై చర్చించేందుకే ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సెన్సార్ సభ్యులందరితోనూ మంగళవారం ప్రసూన్ జోషి చర్చించనున్నారట. ఇక మరోవైపు ఈ ఆరోపణల నేపథ్యంలో త్వరలో రానున్న హిందీ, ప్రాంతీయ సినిమాల సెన్సార్ పనులను ఆ బోర్డు ఇంకా క్లియర్ చేయలేదని తెలుస్తోంది. దీంతో ఆయా చిత్రాల విడుదల తేదీలను వాయిదా వేయాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
‘మార్క్ ఆంటోని’ (Mark Antony) సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో తాను లంచం ఇవ్వాల్సి వచ్చిందని నటుడు విశాల్ సెప్టెంబర్ 28న ఆరోపణలు చేశారు. ఆ సినిమా సెన్సార్ కోసం దాదాపు రూ.6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన తెలిపారు. అవినీతి గురించి తెరపై చూడడం ఓకేగానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు విశాల్ పేర్కొన్నారు. తాను నటించిన ‘మార్క్ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ పనులు పూర్తయ్యేందుకు స్క్రీనింగ్ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ. 3 లక్షలు సంబంధిత అధికారులకు ఇచ్చినట్లు విశాల్ ఆరోపించారు. దీనిపై కేంద్రం కూడా స్పందించి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయంపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.