‘Apollo’ -కోల్‌కతాలో మరో ఆసుపత్రి

కోల్‌కతాలోని సోనార్‌పూర్‌లో పాక్షికంగా నిర్మించిన ఒక ఆస్పత్రిని అపోలో హాస్పిటల్స్ సొంతం చేసుకుంది. తద్వారా అపోలో హాస్పిటల్స్ తూర్పు భారతదేశంలో వైద్య సేవలను బహుముఖంగా విస్తరించడానికి సన్నద్ధం అయ్యింది. ఫ్యూచర్ ఆంకాలజీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనే పాక్షికంగా నిర్మించిన ఈ ఆస్పత్రిని రూ.102 కోట్లతో అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ లిమిటెడ్ అనే అనుబంధ కంపెనీ ద్వారా అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలు చేసింది. దీనికి పూర్తిగా సొంత నిధులు కేటాయించినట్లు అపోలో హాస్పిటల్స్ పేర్కొంది. కోల్‌కతా ప్రాంతంలో అపోలోకు ఇది రెండో ఆస్పత్రి అవుతుంది. దాదాపు 325 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రిలో మొదటి దశ కింద 225 పడకలను వచ్చే ఏడాదిలోగా సిద్ధం చేసి వైద్య సేవలను ప్రారంభించాలని అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం భావిస్తోంది. అపోలో హాస్పిటల్స్‌కు కోల్‌కతాతో పాటు భువనేశ్వర్, గువహటి నగరాల్లోనూ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రుల్లో 1800 పడకల సామర్థ్యం ఉండగా, దీన్ని వచ్చే మూడేళ్లలో 2,500 పడకలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.