TDP: చంద్రబాబు ఏ బాధ్యత అప్పగించినా చేస్తా: గుమ్మనూరు జయరాం

మంత్రి పదవికి రాజీనామా చేశాకే తాను తెదేపాలో చేరానని ఆ పార్టీ నేత గుమ్మనూరు జయరాం అన్నారు. పదవి వదులుకున్నాక బర్తరఫ్ చేసినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు.
అమరావతి: మంత్రి పదవికి రాజీనామా చేశాకే తాను తెదేపాలో చేరానని ఆ పార్టీ నేత గుమ్మనూరు జయరాం అన్నారు. పదవి వదులుకున్నాక బర్తరఫ్ చేసినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు. అధినేత చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. ఆలూరుకు సేవలందించా.. ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నా. ఆ స్థానంపై కొందరు ఆశలు పెట్టుకోవచ్చు.. తాను అందర్నీ కలుపుకొని ముందుకెళ్తా. రాష్ట్రానికి మంచి జరగాలని.. చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు’’ అని జయరాం అన్నారు. అంతకుముందు ఆయన ఆధ్వర్యంలో ఆలూరుకు చెందిన పలువురు వైకాపా నేతలు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.