Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటీ చేసేది ఎక్కడ అంటే..? ఆ రెండు చోట్లేనా..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం తేలలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న పవన్ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడలేదు. రోజుకో కొత్త నియోజకవర్గం పేరు వినిపిస్తోంది. గత ఎన్నికల్లో బరిలోకి దిగిన గాజువాక, భీమవరం నుంచి మాత్రం పోటీ చేయరని జనసేన నేతలు చెబుతున్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు..? ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా..? లేదంటే ఆధ్మాత్మిక కేంద్రం నుంచి బరిలోకి దిగుతారా..? అసెంబ్లీకి పోటీ చేస్తారా..? లేదంటే లోక్ సభ బరిలో ఉంటారా..? ఇంతకీ పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఏది. ఇప్పుడు ఈ ప్రశ్నలు జనసేన శ్రేణులనే కదా సామాన్యులను తొలచి వేస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న పవన్ కల్యాణ్పోటీ చేసే నియోజకవర్గంపై మాత్రం స్పష్టత రావడం లేదు.
ఎక్కడి నుంచి పోటీ అంటే..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పవన్ కల్యాణ్ బరిలోకి దిగారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఈ సారి పవన్ కల్యాణ్ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జనసేన పార్టీ లీకులు ఇస్తోంది. అలా రకరకాల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. కాకినాడ, పిఠాపురంతోపాటు భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల అని చెబుతున్నారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గం గురించి రోజుకో పేరు తెరపైకి వస్తోంది. చివరకు ఆధ్మాత్మిక కేంద్రం తిరుపతి పేరు కూడా వచ్చింది. ఇందులో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం ఖాయం అని జనసేన నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ సారి రెండో స్థానం అసెంబ్లీ కాకుండా లోక్ సభ నుంచి పోటీ చేస్తారని హింట్ ఇస్తున్నారు. అనకాపల్లి లోక్ సభ నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. అనకాపల్లి నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. నియోజవకర్గంలో నాగబాబు ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. పవన్ బరిలోకి దిగుతారని వార్తల నేపథ్యంలో నాగబాబు ఇళ్లు ఖాళీ చేశారని సమాచారం.
కన్ఫామ్ ఇక్కడి నుంచే..?
పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ బరిలోకి దిగుతారని జనసేన నేతలు ద్వారా తెలిసింది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు 90 వేలకు పైగా ఉన్నాయి. ఆ ఓట్లతో పవన్ గెలవడం ఈజీ అని అంచనా వేస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. అనకాపల్లి లోక్ సభ స్థానంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో బరిలోకి దిగాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో 90 శాతం కాపు ఓటు బ్యాంక్ ఉందని చేసిన అంతర్గత సర్వేలో తేలింది. అనాకపల్లిలో టీడీపీ క్యాడర్ కూడా పవన్ కల్యాణ్ విజయం కోసం పనిచేస్తామని భరోసా ఇచ్చారట. పవన్ కల్యాణ్ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో విజయం సాధిస్తే.. 2024లో బీజేపీ అధికారం చేపడితే కీలక పదవీ దక్కే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీజేపీ మాట ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది
మరో ఆప్షన్ ఇదే..?
అనూహ్య పరిణామాలతో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగకుంటే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఎక్కువ ఓటర్లు ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి చిరంజీవి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డిని ఓడించారు. ఆ సమయంలో రెండో స్థానం భీమవరం నుంచి పోటీ చేసి చిరంజీవి ఓడిపోయారు. తిరుపతిలో చిరంజీవి గెలవడానికి ప్రధాన కారణం బలిజలు. పవన్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన చాలా మంది నాయకులతో పవన్ కల్యాణ్ టచ్ లోకి వచ్చినట్టు సమాచారం. పొత్తులో భాగంగా తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తే.. పార్లమెంట్ స్థానాన్ని ఈజీగా గెలవచ్చని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ తిరుపతి వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి, అనకాపల్లి లోక్ సభ నుంచి పవన్ కల్యాణ్ బరిలో ఉండటం పక్కా అని అతని సన్నిహితులు చెబుతున్నారు. పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారో మరికొద్దీరోజుల్లో తేలనుంది.