#Andhra Politics #Andhra Pradesh News

రైతు నష్టపోకూడదు.. అదే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్‌

అమరావతి: వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్‌ ఆరంభంలో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(పంట నష్టపరిహారం)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఐదేళ్లుగా అన్నదాతలకు అండగా ఉంటున్నామన్నారు. పంట నష్టపోయిన రైతులకు తోడుగా ఉంటున్నామన్నారు. సచివాలయ పరిధిలోనే పంటనష్టోయిన రైతుల లిస్ట్‌ ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా రైతులకు పరిహారం అందిస్తున్నాం. రైతులకు నష్టం కలగకుండా రంగు మారినా ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

ఖరీఫ్‌–2023లో 103 మండలాలను కరువు మండలాలను ప్రకటించడమే కాకుండా.. ఆయా మండలాల పరిధిలో 14.24 లక్షల ఎకరాల్లో 33 శాతం కంటే ఎక్కువగా పంటలు కోల్పోయిన 6,59,897 మంది రైతులకు రూ. 847.22 కోట్ల పెట్టుబడి రాయితీని అందిస్తున్నారు. మేలో కురిసిన అకాల వర్షాల వల్ల 5 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 1,892 మంది రైతులకు రూ. 5 కోట్లు కోత అనంతర పంట నష్టపరిహారం అందించనున్నారు.

రబీ సీజన్‌ ఆరంభంలో డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు, గాలుల వల్ల జరిగిన పంట నష్టంతో పాటు, నేల కోత, ఇసుక మేటలు కారణంగా నష్టపోయిన 4.61లక్షల మంది రైతులకు రూ. 442.36 కోట్ల పెట్టుబడి రాయితీని ఇవ్వనున్నారు. ఇలా కరువు, మిచాంగ్, కోత అనంతర పంటలను కోల్పోయిన 11,59,126 మంది వ్యవసాయ, ఉద్యాన రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్ము కింద రూ. 1,294.58 కోట్లను నేరుగా వారి ఖాతాలకు జమ చేయనున్నారు.

తాజాగా జమ చేయనున్న ఇన్‌పుట్‌ సబ్సిడీతో కలిపి ఈ ఐదేళ్లలో 34.41 లక్షల మంది రైతులకు రూ. 3,261.60 కోట్లు పెట్టుబడి రాయితీని అందించారు. ఈ 57 నెలల్లో పెట్టుబడి రాయితీ కింద 22.82 లక్షల వ్యవసాయ, ఉద్యాన, పట్టు రైతుల ఖాతాలకు రూ. 1,967.02 కోట్లు నేరుగా జమ చేశారు.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *