జగన్ మోసం చేశారు.. జనసేనలో చేరుతున్నా: చిత్తూరు ఎమ్మెల్యే

బలిజ కులానికి చెందిన తనకు వైకాపాలో గడచిన అయిదేళ్లలో అనేక అవమానాలు ఎదురయ్యాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరు: బలిజ కులానికి చెందిన తనకు వైకాపాలో గడచిన అయిదేళ్లలో అనేక అవమానాలు ఎదురయ్యాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపాలో కాపులకు జరుగుతున్న వివక్షను చూసి విసిగిపోయి పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గురువారం పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.
‘‘ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి వైకాపాకు అంకితభావంతో పనిచేశా. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చిత్తూరును రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపా. పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన నాకు 2024 ఎన్నికల్లో సీఎం జగన్ చిత్తూరు టికెట్ ఇస్తానని మోసం చేశారు. టికెట్ ఇవ్వకపోగా రాజ్యసభకు పంపిస్తామని చెప్పి వైకాపా పెద్దలు మళ్లీ మోసం చేశారు. చిత్తూరులో కాపు భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినా జగన్ స్పందించలేదు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.29 కోట్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నా సొంత నిర్మాణ సంస్థ జేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ ద్వారా వివిధ ప్రాంతాల్లో చేసిన పనులకు బిల్లులు రూ.73 కోట్లు ఆపేశారు. కొందరు పెద్దలు.. వారికి అనుకూలమైన వారికి మాత్రమే బిల్లులు మంజూరు చేయించుకున్నారు. ఏపీఐఐసీ ఛైర్మన్ పోస్టు ఇస్తామని చెప్పి మోసం చేశారు. బలిజలు వైకాపాకు చేసిన అన్యాయమేంటి? రాయలసీమలో బలిజలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు’’ అని విమర్శించారు.