Madras High Court comments on ‘Sanatana Dharma’ controversy – ‘సనాతన ధర్మ’ వివాదంపై మద్రాసు హైకోర్టు స్పందించింది

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు(Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదని పేర్కొంది.
‘Opposition to Sanathana’ అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలంటూ ఓ కళాశాల జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని విచారణలో భాగంగా జస్టిస్ ఎన్. శేషసాయి.. సనాతన ధర్మం అంశం చుట్టూ జరుగుతోన్న చర్చపై ఆందోళన వ్యక్తం చేశారు.
‘అంటరానితనం సహించలేనిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిర్మూలించినట్లు ప్రకటించినందున.. ఇక దేశంలో దానికి స్థానం లేదు. అలాగే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. కాకపోతే భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదు. మరీ ముఖ్యంగా మతానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.