Attempts To Bring An End To Sanatana Dharma – సనాతన ధర్మాన్ని అంతం చేసే ప్రయత్నం

‘‘దురహంకారి కూటమి ఇటీవలే ముంబైలో సమావేశమైంది. ఆ కూటమికి ఒక విధానం లేదు, ఒక నాయకుడు లేడు. సనాతన ధర్మంపై దాడి చేసి, నాశనం చేయాలన్న రహస్య ఎజెండా మాత్రమే ఉంది. సనాతన ధర్మం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తి పొందారు. స్వాతంత్య్రం కోసం ఆయన సాగించిన పోరాటం సనాతన ధర్మం చుట్టూ కేంద్రీకృతమైంది. మహాత్ముడు జీవితాంతం సనాతన ధర్మాన్ని పాటించారు. ఆయన చివరిసారిగా ‘హే రామ్’ అంటూ నెలకొరిగారు.
రాణి అహిల్యాబాయి హోల్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ వంటి మహనీయులు సనాతన ధర్మ నుంచి స్ఫూర్తి పొంది ముందుకు నడిచారు. విపక్ష కూటమి నాయకులు బహిరంగంగా మాట్లాడడం ప్రారంభించారు. వారు మనపై దాడికి పదును పెడుతున్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ, దేశాభిమానులు ఈ విషయం గమనించాలి. అప్రమత్తంగా ఉండాలి. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు సాగుతున్న కుట్రలను మనమంతా కలిసికట్టుగా అడ్డుకోవాలి. మనం ఐక్యంగా ఉంటే వారి ఆటలు సాగవు. వారి ప్రయత్నాలనీ విఫలమవుతాయి.