Nipah Virus Is Creating A Stir In Kerala Again – కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది

తాజాగా కొయ్‌కోడ్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తికి నిఫా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ప్రస్తుత కేసుతో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఆరుకు పెరిగింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.
ఇంతకుముందు నిఫా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు చికిత్స అందించిన ఆసుపత్రిలోనే ఈ వ్యక్తిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారని ఆరోగ్యశాఖ తెలిపింది. నిఫా వ్యాప్తిని కట్టడిలో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొయ్‌కోడ్ జిల్లా యంత్రాంగం.. శుక్రవారం కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించారు. అలాగే ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. నిఫా వ్యాప్తి నేపథ్యంలో అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి.
భయపడాల్సిన పనిలేదు: ఆరోగ్య మంత్రి
వైరస్ కట్టడికి అన్ని నివారణ చర్యలు అమల్లో ఉన్నాయని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ భరోసా ఇచ్చారు. ఒక్క కొయ్‌కోడ్ మాత్రమే కాకుండా కేరళ మొత్తం ఇలాంటి ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ అధ్యయనాల్లో వెల్లడైందని చెప్పారు. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుత కేసు అటవీ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే వెలుగుచూసిందని తెలిపారు.
మెదడును అత్యంత తీవ్రంగా దెబ్బతీసే నిఫా వైరస్‌ను 1999లో తొలిసారి గుర్తించారు. మలేసియా, సింగపూర్‌లోని పందుల పెంపకందారుల్లో ఈ ఇన్ఫెక్షన్ను కనుగొన్నారు. కేరళలో ఈ వైరస్ 2018లో తొలిసారి వెలుగు చూసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు వ్యాప్తిలోకి వచ్చింది. 23 మందికి వైరస్ నిర్ధారణ కాగా అందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారంటే అదెంతో ప్రాణాంతకమో అర్థం చేసుకోవచ్చు. 2019, 2021ల్లోనూ ఇద్దరు బాధితులు.