Two strange shapes believed to be alien corpses… – ఏలియన్ శవాలుగా భావిస్తున్న రెండు వింత ఆకారాలు…

మెక్సికో పార్లమెంటు (కాంగ్రెస్) సమావేశాల్లో తాజాగా అరుదైన పరిణామం చోటుచేసుకుంది. గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా(Alien corpses) భావిస్తున్న రెండు వింత ఆకారాలను మంగళవారం కొందరు పరిశోధకులు నేరుగా పార్లమెంటుకు తీసుకొచ్చారు. చట్టసభ్యుల ముందు వాటిని ప్రదర్శించి.. తమ పరిశోధనల్లో ఇప్పటివరకూ వెలుగుచూసిన అంశాలను వారికి నివేదించారు. ఇలా పార్లమెంటు సభ్యుల ముందు తమ వాంగ్మూలాలను అందజేసినవారిలో మెక్సికోతో పాటు అమెరికా, జపాన్, బ్రెజిల్ పరిశోధకులూ ఉన్నారు. గ్రహాంతరవాసుల ఉనికి నిజమే అయ్యుండొచ్చని వారు సూచించడం గమనార్హం. పెరూలోని నజ్కా ఎడారిలో జరిపిన తవ్వకాల్లో 2017లో రెండు విచిత్ర ఆకారాలు బయటపడ్డాయి. అవి గ్రహాంతరవాసులవేనని అప్పటి నుంచి పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా బయటపడ్డ వాస్తవాలను మెక్సికో కాంగ్రెస్ సభ్యులకు తెలియజేసేందుకే.. ఆ రెండు ఆకారాలను పార్లమెంటుకు తీసుకొచ్చారు. మెక్సికో పాత్రికేయుడు జోస్ జైమ్ మౌసాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ- ఆ వింత ఆకారాలు మానవేతరులవని డీఎన్ఏ పరీక్షల్లో స్పష్టమైందన్నారు. భూ ప్రపంచంలో వేటికీ అవి సరిపోలడం లేదని పేర్కొన్నారు. కాబట్టి గ్రహాంతరవాసుల ఉనికి వాస్తవమేనని విశ్వసించాల్సిన అవసరముందని తెలిపారు. అయితే ప్రస్తుతం పార్లమెంటులో ప్రదర్శించిన ఆకారాలు.. గ్రహాంతరవాసులవేనని పక్కాగా ఇప్పుడే తాను చెప్పడం లేదన్నారు.