Protect trees – మట్టి మేలు తలపెట్టవోయ్!

మనం చేసుకునే ప్రతి పండగ ప్రకృతితో మమేకమై ఉంటుంది.. చెట్లను కాపాడుకోవడం, చెరువులను రక్షించడం అందులోని ప్రత్యేకత. ఆధునికత ముసుగులో రానురానూ పండగ స్ఫూర్తి లోపిస్తోంది. పైపై హంగులు పెరిగి ప్రకృతికి విఘాతం కలుగుతోంది. ఏటా వినాయక చవితికి విగ్రహాలు అందంగా, వర్ణయుతంగా ఉండాలన్న ఉద్దేశంతో పోటీపడి ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా పర్యావరణం కాలుష్యమై మనతోపాటు చాలా జీవులు ఇబ్బందులు పడుతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రంగురంగుల రసాయనాలతో చేసిన విగ్రహాలనే ఎక్కువగా ఏర్పాటు చేస్తుంటారు. భవిషత్తులో ప్రమాదాలు ఎదురుకాకూడదంటే పర్యావరణ హిత విగ్రహాలనే ఏర్పాటు చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామగ్రామాన వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు. యాభై వేల వరకు మండపాల్లో పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇక చిన్న చిన్న విగ్రహాలను లక్షల సంఖ్యలోనే ఏర్పాటు చేస్తుంటారు. వీటిలో ఎక్కువగా రసాయనాలు వినియోగించి తయారు చేసినవే.
- ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీˆఓపీˆ) అనేది ఒక రసాయన పదార్థం. ఇది తక్కువ ధరకు లభిస్తుంది. దాన్ని నీటితో తడిపి కావలసిన ఆకృతిలో సులభంగా మలుచుకుని ఆరబెడితే చాలు. వేగంగా విగ్రహాలు తయారవుతుండటంతో పెద్దఎత్తున విక్రయించేవారు వినియోగిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీˆఓపీˆ) లో భాస్వరం, సల్ఫర్, జిప్సం, మెగ్నీషియం ఉండగా, ఆకర్షణీయ రసాయన రంగుల్లో కాడ్మియం, లెడ్, కార్బన్, మెర్క్యురీ వంటి భార లోహాలుంటాయి. విగ్రహాల నిమజ్జనం తర్వాత ఇవి నీటిలో పేరుకుపోతే మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం పీఓపీ నీటిలో కలిసినపుడు నీటిని వేడిగా చేస్తుంది. గాలిలో కలిసినపుడు దాన్ని పీˆల్చడం వల్ల మెదడుపై తీవ్ర దుష్ప్రభావం ఉంటుంది. జీర్ణ, శ్వాస, విసర్జక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. డయేరియా, విరేచనాలు వంటి సమస్యలు కలుగుతాయి.
హాని కలగని విధానం
మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటే నిమజ్జనం సులభమవుతుంది. మట్టిలో మట్టి కలవడం వల్ల భూమి, నీరు సహజ స్వభావాన్ని కోల్పోవు. చేపలు, ఇతర జీవులకు ఎలాంటి హానీ ఉండదు.మట్టి ప్రతిమలకు పూలు, ఆకులు, చెట్ల బెరడు, ఫలాలతో తయారుచేసిన రంగులను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వారు ఓ తొట్టెలో నీటిని పోసి అందులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు. ఆ మట్టిని చెట్లకు వాడటం వల్ల ప్రకృతిని మనం కాపాడినవారమవుతాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో పెద్దపెద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపుల ద్వారా నీటిని చిలకరించి ప్రతిష్ఠించిన చోటనే నిమజ్జనం చేస్తారు.
జల, భూ కాలుష్యం
విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల చేపలు, ఇతర జలచరాలపై ప్రభావం పడుతుంది. వాటిని ఆహారంగా తీసుకోవడం మూలంగా మన ఆరోగ్యంపై దుష్ఫలితాలు ఉంటాయి. చెరువులోని సహజ ఒండ్రుమట్టిలో పీˆఓపీˆ పేరుకుపోతుంది. ఆ ఒండ్రును రైతులు పంటపొలాల్లో వేసుకుంటే భూ సారం తగ్గిపోతుంది. పీˆఓపీˆ భూమిలో కలవదు, నీటిలో కరగదు, కుళ్లిపోదు. ఏళ్ల తరబడి కనిపించని కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో మచ్చుకు కొన్ని
- గద్వాలలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి ఆలయంలో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత ఆరేళ్లుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తితో పూజలు చేస్తున్నారు. పర్యావరణానికి మేలు చేయడంలో తమ వంతు కృషి చేస్తున్నామని అధ్యక్షుడు బానాల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర తెలిపారు.
- నారాయణపేటలో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్‌పూర్ లక్ష్మీకాంత్ ఐదేళ్లుగా ఉచితంగా మట్టి వినాయకులను అందిస్తున్నారు. ప్రజల్లో ప్రకృతి పట్ల అవగాహన పెంచడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టానని చెబుతున్నారు.
- కోస్గి శివాజీకూడలిలో ఛత్రపతి శివాజీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు.
ఇలా చేద్దామా?
- ధాన్యపు గింజలతో వినాయకుడిని చేసుకోవడం వల్ల అందంగా, వినూత్నంగా ఉంటుంది.
- పత్తితో వినాయకుడిని చేసుకోవడం తేలిక. ఎంతో ఆకర్షణీయం.
- మూడు రోజుల్లో నిమజ్జనం చేసేవారు ఆకులు, పూలతో తయారు చేసుకోవచ్చు.
- కూరగాయలతో విగ్రహాన్ని తయారుచేసి అయిదు రోజుల పాటు పూజలు జరుపుకోవచ్చు.
- మహబూబ్‌నగర్‌లో కొన్ని ప్రాంతాల్లో పండ్లు, మంచుతో చేసిన విగ్రహాలు గతంలో వాడిన సందర్భాలు ఉన్నాయి.
ప్రకృతిపై ప్రేమ కలిగేలా..
వినాయక ఉత్సవాలలో పిల్లలే ఎక్కువగా పాల్గొంటారు. చిన్నతనం నుంచే వారికి ప్రకృతి రక్షణ గురించి నేర్పాలి. పూజలో వాడే 21 రకాల పత్రాలు (ఆకులు), వాటి ప్రాముఖ్యం తెలియజేయాలి. రసాయన విగ్రహాల వల్ల జలవనరుల కలుషితాన్ని వివరించి మట్టి వినాయకుల ఆవశ్యకతను తెలపాలి. బంక మట్టి ఇచ్చి వారితో విగ్రహాలు తయారు చేయిస్తే ఆటవిడుపుతోపాటు వారిలో నైపుణ్యం పెరిగి ప్రకృతిపై ప్రేమ కలుగుతుంది.