#ట్రెండింగ్ న్యూస్

Power generating stations- నేరుగా విద్యుత్తును విక్రయించవచ్చు

పెరుగుతున్న డిమాండును దృష్టిలో పెట్టుకుని కరెంటు కొరత ఉన్న రాష్ట్రాలకు కేంద్రం కొత్త అవకాశమిచ్చింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లో పేర్కొన్న గడువు తేదీ ముగిసిన తరవాత విద్యుదుత్పత్తి కేంద్రాలు(జెన్‌కో) కరెంటును నేరుగా అమ్ముకోవచ్చు. ఇందుకు అవకాశమిస్తూ కేంద్ర విద్యుత్‌శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గడువు ముగిసినా… పాత ఒప్పందంలో కరెంటు కొన్న డిస్కంలు అడిగితే తిరిగి విక్రయించాలని గత మార్చిలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. గడువు ముగిసినా ఆ డిస్కంలకు అవకాశమిస్తే… తక్కువ ధరకు లభించే కరెంటును మాత్రమే కొని, ఉత్పత్తి వ్యయం అధికంగా ఉన్న ప్లాంట్ల నుంచి తీసుకోవడం లేదని తేలినందున గత ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి పీపీఏ గడువు ముగిసిన థర్మల్‌, గ్యాస్‌ ఆధారిత విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తయ్యే కరెంటును జెన్‌కోలు నేరుగా ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ(ఐఈఎక్స్‌)లో గానీ, ఇతర డిస్కంలకు గానీ అమ్ముకోవచ్చు.

గడువు ముగిస్తే సెంట్రల్‌పూల్‌లో చేరవచ్చు

కేంద్ర ప్రభుత్వ విద్యుదుత్పత్తి కేంద్రాలలో కూడా పీపీఏలు ముగిస్తే వాటిలో ఉత్పత్తి చేసే కరెంటును అమ్మేందుకు కొత్తగా సెంట్రల్‌పూల్‌ విధానం రూపొందించినట్లు కేంద్ర విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 15,386 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల మొత్తం 16 ప్లాంట్లలో రోజూ 79,247.60 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఉత్పత్తవుతుంది. ఈ కరెంటును కొనడానికి ఆసక్తి ఉన్న డిస్కంలు దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమున్న డిస్కంలు కనీసం ఐదేళ్లపాటు కరెంటు కొంటామనే షరతుతో కొత్త పీపీఏ చేసుకోవాలి. ఉదాహరణకు రామగుండం ప్లాంట్లలో 13,080.30 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఉత్పత్తవుతుంది. దీనిని యూనిట్‌కు రూ.2.60 చొప్పున చలనఛార్జీ, మరో 54 పైసలు స్థిరఛార్జీ కింద చెల్లించి కొనవచ్చు. ఎవరూ కొనుగోలుకు ముందుకు రాకపోతే ఈ ప్లాంట్లలో విద్యుత్‌ను భారత ఇంధన ఎక్స్ఛేంజిలో అమ్ముతారు. భవిష్యత్తులో పాతికేళ్ల గడువు పూర్తయిన ఏ విద్యుత్కేంద్రం అయినా ఇలా సెంట్రల్‌పూల్‌లో చేరవచ్చని కేంద్రం తెలిపింది. సాధారణంగా ఒక విద్యుత్కేంద్రం నిర్మించిన తరవాత దానిలో ఉత్పత్తయ్యే కరెంటును కొనడానికి డిస్కంలు 25 ఏళ్ల గడువుతో పీపీఏ చేసుకోవడం ఆనవాయితీ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *