#ట్రెండింగ్ న్యూస్

Anganwadis – డిమాండ్లను నెరవేర్చాం

దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్‌వాడీలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పష్టంచేశారు. ప్రస్తుతం వారు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని డిమాండ్లను తాము నెరవేర్చామన్నారు. హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్‌లో మంగళవారం అంగన్‌వాడీ టీచర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీలను కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేసిన జీవో, అంగన్‌వాడీలు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచిన జీవో, ఉద్యోగ విరమణ అనంతరం టీచర్లకు ఆర్థిక సాయంగా రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు అందించనున్నట్లు ప్రకటించిన జీవోల ప్రతులను యూనియన్‌ సభ్యులకు ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ‘‘తాజాగా జారీ చేసిన మూడు జీవోలతో రాష్ట్రవ్యాప్తంగా 70 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.115 కోట్ల అదనపు భారం పడుతుంది. సర్వీసులో ఉండగా మరణిస్తే టీచర్లకు రూ.20 వేలు, హెల్పర్లకు రూ.10 వేలు తక్షణ సాయం అందుతుంది. అందరికీ 50 ఏళ్ల వయసు వరకు రూ.2 లక్షల జీవిత బీమా అమలు చేస్తాం. 50 ఏళ్లు దాటిన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. అంగన్‌వాడీలపై ఒత్తిడి తగ్గించేందుకు యాప్‌ను సరళీకరిస్తాం. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్రం వాటా 60% ఉండాల్సి ఉండగా… అంగన్‌వాడీ టీచర్ల వేతనాల్లో 19%, హెల్పర్ల వేతనాల్లో 17% మాత్రమే ఇస్తోంది’’ అని వివరించారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి భారతి హొళికెరి, జేడీలు లక్ష్మీదేవి, సునంద, యూనియన్‌ అధ్యక్షురాలు వరలక్ష్మి, టీఎన్జీవో నేత నిర్మల, సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *