TDP-Janasena alliance in the next election – వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు.. జగన్‌కు మిగిలింది ఇక 6 నెలలే అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ….

Andhra pradesh: రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది. జైలు బయట జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తును కన్ఫామ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాము కలిసి వెళ్తేనే వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కోగలమని చెప్పారు. విడివిడిగా పోటీ చేస్తే ఎదుర్కోలేమని చెప్పుకొచ్చారు. వైసీపీని సమష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్న పవన్.. తాము అధికారంలోకి వచ్చాక.. వైసీపీకి మద్దతిచ్చే ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇది వైసీపీ నేతలు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని ఆయన మండిపడ్డారు.
నారా లోకేష్, బాలకృష్ణతో కలిసి చంద్రబాబుతో ములాఖత్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలు, సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి, అన్యాయంగా జైలులో పెట్టడం బాధాకరం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. వారికి సంఘీభావం ప్రకటించేందుకే ఇక్కడికి వచ్చానన్నారు పవన్. చంద్రబాబుకు జైల్లో మరింత భద్రత కల్పించాలని.. బాబు భద్రతపై ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని పవన్ తెలిపారు. బాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని తాను నమ్మట్లేదని.. ఆయన అరెస్ట్‌తో బీజేపీకి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. 2024లో ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయి. తమతో కలిసొచ్చే పార్టీలను కూడా కలుపుకుని పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగోవాలన్నది తన ఆకాంక్ష అని చెప్పిన పవన్.. అందుకు తగ్గట్టుగా జనసేన-టీడీపీ కలిసి పని చేస్తాయన్నారు. జగన్‌కు మిగిలింది ఇక 6 నెలలే అని.. ఆయన యుద్ధం కోరుకుంటే.. దానికి తాము సిద్దంగా ఉన్నామని పవన్ చెప్పుకొచ్చారు.
రేపటి నుంచే టీడీపీ-జనసేన కలిసి పని చేస్తాయని వెల్లడించారు. తమతో బీజేపీ కూడా కలిసి ముందుకు వస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని పవన్ చెప్పారు. ఇవాళే ఈ పొత్తు నిర్ణయం తీసుకున్నానని.. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమైనదని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా, లోకేష్, బాలకృష్ణ పక్కన నిల్చుని రాజకీయంగా మాట్లాడాల్సిన సందర్భం వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పుకొచ్చారు. కానీ ఈ అవకాశాన్ని వైసీపీ, సీఎం జగనే కల్పించారంటూ పవన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.