EKYC registration of all ration card members has started – రేషన్ కార్డు సభ్యులందరి EKYC నమోదు ప్రారంభమైంది

రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల డీలర్ల వేలిముద్రల ఆధారంగానే ఎంఎల్‌ఎస్(MLS) పాయింట్(మండలస్థాయి నిల్వ కేంద్రం) నుంచి రేషన్ దుకాణాలకు(Ration Shops) బియ్యం అందించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తాజాగా రేషన్‌కార్డులోని ప్రతి సభ్యుడి ఈకేవైసీ(EKYC) నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం చౌకధరల దుకాణాల్లోని ఈ-పోస్ యంత్రంలో అవసరమైన సాంకేతికతను పొందుపర్చారు. ఈ నెల 6న బియ్యం పంపిణీ ప్రారంభం కాగా.. కార్డులోని సభ్యులందరూ కార్డులోని సభ్యులందరూ వచ్చి వేలిముద్రలు వేయాలని డీలర్లు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ వేలిముద్ర పడకుంటే ఐరిస్ ద్వారా వివరాలు నమోదు చేసుకుంటున్నారు.
సరకు పక్కదారి పట్టకుండా..
ప్రస్తుతం రేషన్‌కార్డులోని ఒక సభ్యుడిని ఒక యూనిట్‌గా పరిగణిస్తూ ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆరుగురు సభ్యులున్న కార్డుకు 24 కిలోలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17,251 రేషన్ దుకాణాల పరిధిలో 90,05,289 కార్డులుండగా.. 2,82,48,886 మంది సభ్యులున్నారు. కొన్నేళ్లుగా కార్డులోని సభ్యుల విషయంలో పక్కా సమాచారం కొరవడింది. అదనపు, మరణించినా వారి పేర్లపై బియ్యం తీసుకుంటుండటంతో కోటా మించి సరఫరా చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈకేవైసీ విధానాన్ని తెరపైకి తెచ్చారు. కొన్ని నెలలపాటు సభ్యులందరి వేలిముద్రలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని డీలర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఆ తరువాత కూడా నమోదు చేయని సభ్యుల పేర్లను తొలగించనున్నారు. మరోవైపు కొత్త కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో వాస్తవ లబ్ధిదారుల సంఖ్య తేలనుంది.