Srisailam waters into Narlapur tunnel – నార్లాపూర్ టన్నెల్ లోకి శ్రీశైలం నీళ్లు

ఎల్లూరు గ్రామంలోని నార్లాపూర్ పంప్ హౌస్ సమీపంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పాలమూరు పథకంలోని ఎత్తిపోతలను ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభించనుండటంతో ప్రాజెక్టు అధికారులు మంగళవారం సాయంత్రం రేగుమాన్‌గడ్డ తీరంలోని అప్రోచ్ కెనాల్ సేఫ్టీ వాల్ 4వ గేటును తెరిచి శ్రీశైలం తిరుగు జలాలను సొరంగంలోకి వదిలారు. దీంతో 20 మీటర్ల వెడల్పు, 255 మీటర్ల పొడవు, 74 మీటర్ల ఎత్తులో నిర్మించిన సర్జ్‌పూల్‌లోకి శ్రీశైలం తిరుగుజలాలు భారీగా చేరుకుంటున్నాయి. 145 మెగావాట్ల సామర్థ్యం గల ఒక పంపుతో 3001 క్యూసెక్కుల చొప్పున 2 టీఎంసీల నీటిని అంజనగిరి జలాశయంలోకి ఎత్తిపోసి నిల్వ చేయనున్నారు. ఇప్పటికే డెలివరీ సిస్టమ్ దగ్గర మూడు పంపులను సిద్ధంగా ఉంచారు. సొరంగంలోకి నీటిని వదులుతుండడంతో పక్కనే ఉన్న ప్రత్యామ్నాయ సొరంగం ద్వారా నార్లాపూర్ పంపుహౌస్‌లోకి వెళ్లి మిగిలిన పనులను కార్మికులు పూర్తి చేస్తున్నారు. ఎత్తిపోతల సలహాదారుడు పెంటారెడ్డి మాట్లాడుతూ.. సొరంగంలోకి నీళ్లను వదలడంతో ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలను అధిగమించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సీఈ అబ్దుల్ హమీద్‌ఖాన్, ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు, ఏఈలు పర్యవేక్షించారు.