G20 summit 2023: జీ20లో ఆఫ్రికా యూనియన్ చేరిక దాదాపు ఖాయం..

భారత్ (India) అధ్యక్షతన జీ20 (g20 summit 2023) విస్తరణ దాదాపు ఖాయమైంది. తాజా దిల్లీ శివార్లలోని ఓ రిసార్టులో జీ20 షెర్పాల సమావేశంలో ఆఫ్రికా యూనియన్‌కు సభ్యత్వం ఇవ్వడానికి ఓ అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. కాకపోతే ఆఫ్రికా యూనియన్ చేరిక తర్వాత జీ20 గ్రూపు పేరును జీ21గా మారుస్తారా లేదా అన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. తాజాగా దీనిపై ప్రకటన వెలువడితే మాత్రం జీ20లో పేద దేశాల ప్రాతినిధ్యం ఇచ్చినట్లవుతుంది. భారత్ అధ్యక్షతన ఈ గ్రూపుపై చెరగని ముద్రవేసినట్లవుతుంది.
జీ20 దేశాల అగ్రనేతల వ్యక్తిగత ప్రతినిధులు మధ్యాహ్నం వరకు చర్చలు జరిపారు. తర్వాత దిల్లీలోని ప్రధాన వేదిక వద్దకు వెళ్లనున్నారు. అక్కడ కూడా దిల్లీ డిక్లరేషన్‌పై ఓ అవగాహనకు వచ్చేందుకు చర్చలు జరపనున్నారు.
ఇప్పటి వరకు సంయుక్త ప్రకటన లేకుండా ఏ జీ20 సదస్సు ముగియలేదు. ఈ నేపథ్యంలో భారత అధికారులు సభ్యదేశాల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం సదస్సు ముగిసే సమయానికి ఓ అవగాహనకు వస్తారని భారత్ ఆశిస్తోంది.