#Sport News

Gayathri In Semis: సెమీస్‌లో గాయత్రి జోడీ

సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోరు కొనసాగుతుంది.

సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోరు కొనసాగుతుంది. గురువారం ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన భారత జంట మరో సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో గాయత్రి- ట్రీసా జోడీ 18-21, 21-19, 24-22తో ఆరో ర్యాంకర్‌ కిమ్‌ యియాంగ్‌- కాంగ్‌ యాంగ్‌ (కొరియా) జంటను చిత్తుచేసింది. హోరాహోరీగా సాగిన పోరులో అత్యుత్తమ ఆటతీరుతో ప్రత్యర్థి ఆట కట్టించింది. తొలి గేమ్‌లో భారత షట్లర్లు గట్టి పోటీనిచ్చినా.. కొరియా జంటదే పైచేయి అయింది. రెండో గేమ్‌లో గాయత్రి జోడీ 7-3తో ఆధిపత్యం కనబరిచింది. అయితే కిమ్‌- యాంగ్‌ జంట వరుస పాయింట్లతో చెలరేగి 18-12తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో మరో 3 పాయింట్లు గెలిచివుంటే వారిదే మ్యాచ్‌. కానీ అద్భుతంగా పుంజుకున్న భారత జంట వరుసగా 5 పాయింట్లు నెగ్గి 18-17తో ప్రత్యర్థిని సమీపించింది. ఒక పాయింటు నెగ్గిన కిమ్‌- యాంగ్‌ జంట 19-17తో గేమ్‌కు చేరువవడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే అప్పటికే లయను దొరకబుచ్చుకున్న గాయత్రి- ట్రీసా జోడీ వరుసగా 4 పాయింట్లతో ఉత్కంఠకు తెరదించింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ హోరాహోరీగా సాగింది. ఆఖర్లో స్కోర్లు 20-20, 21-21, 22-22తో సమమవుతూ వెళ్లాయి. చివరికి వరుసగా రెండు పాయింట్లు గెలుచుకున్న భారత జంట సెమీస్‌ బెర్తును కైవసం చేసుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *