AB Venkateswara Rao: మధ్యాహ్నం బాధ్యతలు.. సాయంత్రం విరమణ

జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, వేధింపులకు గురైన డైరెక్టర్ జనరల్ హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చివరికి ఆయన కోరుకున్నట్లుగానే పోలీసు యూనిఫాంలో పదవీ విరమణ చేశారు.
అమరావతి: జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, వేధింపులకు గురైన డైరెక్టర్ జనరల్ హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చివరికి ఆయన కోరుకున్నట్లుగానే పోలీసు యూనిఫాంలో పదవీ విరమణ చేశారు. అయిదేళ్లుగా పోస్టింగు ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి అక్రమ కేసులతో ఏబీవీని వేధించిన జగన్ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికారగణం హైకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను విధుల్లోకి తీసుకుని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేయగా… మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 5 గంటలకు పదవీ విరమణ చేశారు.

నీతి, నిజాయితీలే నన్ను మీకు చేరువ చేశాయి
‘ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించి.. సాయంత్రానికి పదవీ విరమణ చేసే పరిస్థితి నాకు కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ అన్నీ బాగానే జరిగాయని భావిస్తున్నా. నా వృత్తి జీవితంలో అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు చట్టం గీతను కొంచెం అటుఇటుగా జరిపానేమోగానీ.. అన్యాయం చేయడానికి ఎప్పుడూ ఆ గీతను జరపలేదు. పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నా. నీతి, నిజాయితీతో ఉండటం, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుకేసి అడ్డుకునేందుకు ప్రయత్నించడమనే నా లక్షణాలే ఈ రోజు నన్ను లక్షల మందికి దగ్గర చేశాయి’ అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. పదవీ విరమణ సందర్భంగా విజయవాడలోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనరేట్‌లో ఆయన్ను ఘనంగా సత్కరించారు. అంతకు ముందు ఏబీవీ మాట్లాడారు.
- నాకొచ్చిన కష్టం వారికొచ్చినట్లుగా భావించి ఎంతో మంది స్పందిస్తున్నారు. ఉన్నత ఉద్యోగాలు, వృత్తులు, స్థానాల్లో ఉన్నవారు కూడా నాకు ఎదురైన సవాళ్లు, వాటి నుంచి నేను బయటకొచ్చిన తీరు చూసి ఉద్వేగంతో కళ్లలో నీరు తెచ్చుకున్నారు. కొందరైతే వెక్కివెక్కి ఏడ్చారు. నా బాధ, పోరాటం, నిజాయితీ నన్ను ఎంత మందికి దగ్గర చేసిందో దీన్ని బట్టి అర్థమైంది. నా జన్మ చరితార్థమైంది.
- వృత్తిరీత్యానే పదవీ విరమణ చేస్తున్నాను. కానీ అన్యాయాన్ని, అణచివేతను ఎదుర్కొనేందుకు ఆఖరి క్షణం వరకూ పనిచేస్తూనే ఉంటా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యత నిర్వర్తించేందుకు తగినన్ని అవకాశాలు పదవీ విరమణ జీవితంలో లభిస్తాయనే నమ్మకం ఉంది. నేను ప్రత్యక్షంగా తెలియకపోయినా.. నేను పడ్డ ఇబ్బందులు, పోరాటం పట్ల ఎంతో మంది స్పందించారు. వారందరికీ రుణపడి ఉంటాను.
- నేను ఇంజినీరింగ్ చదువుకుని టాటా మోటర్స్‌లో ఉద్యోగం చేసేవాణ్ని. అక్కడే కొనసాగుంటే.. ఏదో ఒక ఆటోమొబైల్ కంపెనీలో దేశానికి హెడ్‌గా రిటైర్ అయ్యేవాణ్ని. కానీ ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టాను. అన్యాయాలు, అక్రమాలు, అధర్మం, అణచివేత ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం. అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు చట్టం ద్వారా నా శాయశక్తులా కృషిచేశా. అవినీతికి, చెడు అలవాట్లకు లోనుకావొద్దని సర్వీసులో చేరినప్పుడే నిర్ణయించుకున్నా. 34 ఏళ్ల పాటు నిజాయితీతో, వ్యక్తిత్వంతో గడిపాను. సమాజంలో దుర్మార్గుల కంటే మంచి వాళ్లే ఎక్కువగా ఉంటారని మరోసారి తేలింది.
శుభాకాంక్షలు చెప్పిన ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు
ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, కాటంనేని భాస్కర్, ఐఆర్‌ఎస్ అధికారి సీహెచ్.వెంకయ్య చౌదరి, సమాచార, పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ కృష్ణమోహన్ సహా పలువురు అధికారులు ఏబీ వెంకటేశ్వరరావును శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు చెప్పారు.
కుర్చీలో కూర్చోబెట్టుకుని తోడ్కొని వెళ్లి..
సాధారణంగా డైరెక్టర్ జనరల్ హోదా గల అధికారులు పదవీ విరమణ చేస్తే.. గౌరవ సూచకంగా ఐపీఎస్ అధికారులందరూ హాజరవుతారు. పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపైకి ఆ అధికారిని ఎక్కించి ఆ వాహనాన్ని వారంతా పూల తాళ్లతో లాగుతూ కార్యాలయం బయట వరకూ సగర్వంగా తోడ్కొని వెళ్లి వేరే వాహనంలోకి ఎక్కించి వీడ్కోలు పలుకుతారు. అయితే ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టడంతో ఐపీఎస్ అధికారులు ఈ వీడ్కోలుకు రాలేదు. ఏబీ వెంకటేశ్వరరావును ఆయన శ్రేయోభిలాషులు, సామాన్య పౌరులే కుర్చీలో కూర్చోబెట్టుకుని సగర్వంగా తోడ్కొని వెళ్లారు. గౌరవంగా ఆయన వాహనంలోకి ఎక్కించి వీడ్కోలు పలికారు.
నిజాయితీని నిరూపించారు
ఒక నిజాయితీ గల అధికారి పోరాటం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఏబీ వెంకటేశ్వరరావు చూపించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. అలాంటి అధికారి ఒక గంట పాటు సీటులో కూర్చున్నా చాలని అన్నారు. పదవీ విరమణ సత్కార సభ సందర్భంగా ఏబీవీ సేవలను అభినందిస్తూ, ఆయన్ను కొనియాడుతూ పలువురు మాట్లాడారు. ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేసినప్పటికీ భవిష్యత్తులో ఆయన సేవలు రాష్ట్రానికి, తెలుగు జాతికి అవసరమని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ప్రజలకు మరింతగా సేవ చేసే అవకాశం ఆయనకు భవిష్యత్తులో కలగాలని కోరారు. అమరావతి రాజధాని రైతుల పోరాటానికి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఏబీవీ ఎంతో మద్దతిచ్చారని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ప్రతినిధి పువ్వాడ సుధాకర్ పేర్కొన్నారు.
నేచురల్ క్రిస్టల్ బహూకరణ
ప్రజాస్వామ్య స్ఫూర్తి, పోరాట పటిమతో ఏబీ వెంకటేశ్వరరావు క్రిస్టల్ క్లియర్‌గా బాధ్యతలు తీసుకుని పదవీ విరమణ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడా సురేష్ పేర్కొన్నారు. అందుకు సంకేతంగా నేచురల్ క్రిస్టల్‌ను ఆయన ఏబీవీకి అందజేశారు.