#ANDHRA ELECTIONS #Elections

AP Govt: ఏబీవీని సర్వీసులోకి తీసుకోవాలి.. ఏపీ సీఎస్‌ ఆదేశాలు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara rao)ను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఎత్తివేసింది. ఇవాళే ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌ ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం విజయవాడలోని కార్యాలయంలో ఏబీవీ బాధ్యతలు స్వీకరించారు.

రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైకాపా ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది.  డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌ కలిగిన ఆయనకు ఐదేళ్లుగా పోస్టింగ్‌ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించింది. అక్రమ కేసులతో జగన్‌ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికార గణం వేధించింది. ఆ తర్వాత ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించగా.. సస్పెన్షన్‌ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా.. ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. 

సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్‌ చేశారో.. తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఈ నెల 8న ఆదేశాలిచ్చింది. 22 రోజులు గడిచినా విధుల్లోకి తీసుకోలేదు సరికదా.. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్‌ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సీఎస్‌ జవహర్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ ఏబీ వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *