Air India Flight Delayed 24 Hours : 24 గంటలపాటు ఆలస్యం.. విమానంలో స్పృహ తప్పిన ప్రయాణికులు…..

Air India flight Delay:ఎయిరిండియాకు చెందిన ఓ విమానం 24 గంటల పాటు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి అందులోనే కూర్చోవడంతో కొందరు స్పృహతప్పి పడిపోయారు.
దిల్లీ: మండు వేసవిలో ఎయిరిండియా ప్రయాణికులు అవస్థలు పడ్డారు. విమానం ఆలస్యం (Flight Delay) కారణంగా గంటల తరబడి అందులోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఏసీ కూడా వేయకపోవడంతో వారంతా ఇబ్బందులకు గురయ్యారు. కొందరైతే స్పృహతప్పి పడిపోయారు. దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi Airport)లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎయిరిండియా కు చెందిన ఏఐ 183 విమానం గురువారం మధ్యాహ్నం 3.20 గంటలకు దిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో (Delhi to San Francisco Flight) బయల్దేరాలి.. కానీ, సాంకేతిక సమస్యలు, నిర్వహణ కారణాలతో టేకాఫ్ ఆలస్యమైంది. అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవ్వగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు. దీంతో కొన్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు
ఊపిరాడక కొందరు అస్వస్థతకు గురైనట్లు తోటి ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 8 గంటల తర్వాత కొందరు స్పృహ కోల్పోవడంతో సిబ్బంది ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసినట్లు తెలిపారు. ఇది చాలా అమానవీయమంటూ ఆగ్రహించారు. ఈ పోస్ట్‌కు ఎయిరిండియా (Air India) స్పందించింది.
అనుకోని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని (Flight Delay), ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు విమానం బయల్దేరనుందని తొలుత ఎయిరిండియా వర్గాలు వెల్లడించగా.. కాసేపటికి విమానం రద్దయినట్లు ప్రకటించారు. ప్రయాణికులను మరో విమానంలో పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలా 24 గంటల ఆలస్యం తర్వాత ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు బయల్దేరనున్నారు.