Phone Tapping Case: 1,200 ఫోన్లు ట్యాప్ చేశాం

హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో ఆధారాలను నిందితులు 45 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే గత డిసెంబరు 4న రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు ఎస్ఐబీలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను కట్టర్లతో కట్ చేసినట్లు వెల్లడైంది. ఈ మేరకు ఆధారాల ధ్వంసం కేసులో కీలక నిందితుడు, సస్పెండైన సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు పోలీసులకు వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించిన అతడి నేరాంగీకార వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులోని వివరాల ప్రకారం.. ‘‘ఎన్నికలు జరిగిన గతేడాది నవంబరు 30న ఫోన్ ట్యాపింగ్ నిలిపివేశాం. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం ట్యాపింగ్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను, డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశించారు. ఎన్నికల్లో భారాస ఓడిపోవడంతో డిసెంబరు 4న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కార్యాలయం నుంచి వెళ్లిపోయే ముందు ఆధారాల్ని చెరిపేయాలని ఆయన ఆదేశించడంతో కంప్యూటర్లు, సర్వర్లలోని ఆధారాల్ని ధ్వంసం చేయడంపై దృష్టి సారించాం. అదేరోజు రాత్రి సీసీటీవీ కెమెరాలను ఆపేయాలని ఆర్ఎస్ఐ అనిల్‌కుమార్‌కు సూచించాను. అందుకు ఆయన తొలుత నిరాకరించారు. ఆ విషయాన్ని ప్రభాకర్‌రావుకు చెప్పా. దీంతో తన ఆదేశాలను అమలు చేయాలని ప్రభాకర్‌రావు చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు.. అనిల్‌కుమార్ రాత్రి 7.30 గంటల సమయంలో సీసీ కెమెరాలను ఆపేశారు. అనంతరం కంప్యూటర్ సిస్టమ్స్, సర్వర్లకు సంబంధించిన 50 హార్డ్ డిస్క్‌లను ఆర్ఎస్ఐ హరికృష్ణ తొలగించారు. అదే సమయంలో కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నుంచి శ్రీనివాస్, అనంత్‌లతో పాటు మరో వ్యక్తి ఎస్ఐబీకి వచ్చి.. కొత్త సర్వర్లను, హార్డ్ డిస్క్‌లను ఇచ్చారు. వీటిని పాత వాటి స్థానంలో అమర్చాం. పాతవాటిని హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ ఎలక్ట్రికల్ కట్టర్‌తో కట్ చేశారు. అనంతరం ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లను బయటపడేశాం. నా సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను ఫార్మాట్ చేశాను. పెన్డ్రైవ్లనూ పారేశాను. అదే నెల 13న ప్రభుత్వం నన్ను ఎస్ఐబీ నుంచి రిలీవ్ చేసి.. డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేసింది. అనంతరం సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా బదిలీ చేసింది’’ అని తన వాంగ్మూలంలో ప్రణీత్‌రావు పేర్కొన్నారు.
1000-1200 ప్రొఫైళ్లు రూపొందించాం
‘‘ఎస్ఐబీలో స్పెషల్ టాస్క్‌ల కోసం ఇద్దరేసి చొప్పున ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఏఎస్సైలతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లతో బృందం ఏర్పాటు చేశాం. కోదాడకు చెందిన గుండు వెంకటేశ్వరరావు మా సామాజికవర్గానికే చెందిన ఇన్స్పెక్టర్ కావడంతో ప్రభాకర్‌రావు సహకారంతో ఇంటెలిజెన్స్‌లోకి తీసుకొచ్చాం. ఏపీలోని కైకలూరుకు చెందిన ఇన్స్పెక్టర్ బాలే రవికిరణ్ నా బాల్య స్నేహితుడు కావడంతో అతడినీ తీసుకున్నాం. నమ్మకస్థులైన ఎస్సైలు హనుమంతరావు, శ్రీనివాస్.. ఏఎస్సైలు బ్రహ్మచారి, మాధవరావు.. హెడ్‌కానిస్టేబుళ్లు యాదయ్య, రఫీ.. కానిస్టేబుళ్లు హరీశ్, సందీప్, మధూకర్రావులను మా బృందంలోకి తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు.
మా బ్యాచ్‌లో నాకొక్కడికే పదోన్నతి
‘‘నేను 2007లో ఎస్సైగా పోలీస్‌శాఖలో చేరాను. 2008 నవంబరులో నల్గొండ జిల్లా మోత్కూరు ఠాణాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందాను. అధికార దుర్వినియోగం వ్యవహారంలో అప్పటి ఎస్పీ రాజేశ్‌కుమార్ నాపై క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. నల్గొండ ఎస్పీగా ప్రభాకర్‌రావు వచ్చాక.. సామాజిక సమీకరణలో భాగంగా బీబీనగర్ ఎస్సైగా అవకాశమిచ్చారు. అప్పటి నుంచి ఆయనతో సంబంధాలు పెరిగాయి. 2016లో ప్రభాకర్‌రావు ఇంటెలిజెన్స్‌లోకి వెళ్లాక ఆయన్ని కలిసి నేనూ అక్కడే చేరాను. మొదట్లో ఇంటెలిజెన్స్‌లో నాకు ఎలాంటి పని అప్పగించలేదు. తర్వాత ఎస్ఐబీలో పోస్టింగ్ ఇచ్చినా.. ఇంటెలిజెన్స్‌లోనే ప్రభాకర్‌రావు సూచించిన పనిచేసేవాడిని. సీనియారిటీ ప్రాతిపదికన 2017 డిసెంబరు 29న ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించింది. ప్రభాకర్‌రావు ఐజీగా పదోన్నతి పొంది ఎస్ఐబీ చీఫ్ అయ్యాక నన్ను మళ్లీ ఎస్ఐబీలోకి తీసుకున్నారు. 2021లో నాకు డీఎస్పీగా ఆక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించాలని ప్రభాకర్‌రావు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ, అది తిరస్కరణకు గురైంది. 2022 డిసెంబరులో ప్రభాకర్‌రావు మరోసారి ప్రతిపాదించడంతో నాకు డీఎస్పీగా పదోన్నతి లభించింది. మా బ్యాచ్ మొత్తంలో డీఎస్పీగా పదోన్నతి పొందింది నేనొక్కడినే’’ అని ప్రణీత్‌రావు పేర్కొన్నారు.
ఎస్ఐబీ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ప్రభాకర్‌రావు ఛాంబర్ పక్కనే మాకు రెండు గదుల్ని కేటాయించారు. అంతకుముందెన్నడూ లేని స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్వోటీ) పేరుతో మమ్మల్ని పిలిచేవారు. హైదరాబాద్‌కు చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ సమకూర్చిన టూల్స్‌తో రాజకీయ నేతల ప్రొఫైళ్లను రూపొందించడం.. భారాస ప్రత్యర్థులపై నిఘా ఉంచడం మా పని. 17 కంప్యూటర్లతోపాటు ఒక ల్యాప్‌టాప్, కొన్ని పెన్‌డ్రైవ్‌లు తీసుకున్నాం. మాకు ప్రత్యేక ఇంటర్నెట్ లీజ్డ్ లైన్ ఉండేది. ప్రత్యేక మెయిల్ ఐడీ, రిక్వెస్ట్ ఐడీల ద్వారా కాల్ డేటా రికార్డర్(సీడీఆర్), ఐఎంఈఐ, లొకేషన్ల సమాచార సేకరణకు అనుమతి పొందేవాళ్లం. 1000-1200 మంది ప్రొఫైళ్లు రూపొందించి.. వారి సంభాషణలను రహస్యంగా విన్నాం. నాకు ఎస్ఐబీ నుంచి అధికారికంగా మూడు ఫోన్ నంబర్లుండేవి. సొంతంగా మరో ఐదు నంబర్లు వినియోగించాను.
వాంగ్మూలంలో ప్రణీత్‌రావు
భుజంగరావు, తిరుపతన్నల బెయిల్‌పై విచారణ వాయిదా
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్ల విచారణను నాంపల్లి కోర్టు జూన్ 3కి వాయిదా వేసింది. కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నామని.. బెయిల్ మంజూరు చేయాలంటూ అదనపు ఎస్పీ భుజంగరావు, అదనపు డీసీపీ తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. వీటిపై కౌంటర్లు దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులకు నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వీళ్లిద్దరూ ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు సాక్ష్యాలు ధ్వంసం చేయడంలో కీలకపాత్ర పోషించారని పోలీసులు వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు గతంలో వేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేయగా తాజాగా మరోసారి పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే కేసులో మరో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తనకు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారించిన న్యాయస్థానం ఆయన కుమార్తె లేదా డ్రైవర్ భోజనం అందించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.