Jaya Jaya He Telangana: ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు తుది మెరుగులు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో పూర్తి గీతాన్ని 13.30 నిమిషాల నిడివితో రూపొందించారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా.. 2.30 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందెశ్రీ దీన్ని తీర్చిదిద్దారు. ఈ రెండు గీతాలకు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు.
ఇటీవల కీరవాణి మ్యూజికల్ స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డికి ఈ రెండు గీతాలకు సంబంధించి పలు స్వరాలను ఆయన వినిపించారు. వాటిలో కొన్నింటికి తుది మెరుగులు దిద్దాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించడంతో.. ఆ మేరకు మార్పులు చేర్పులు చేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కీరవాణి, అందెశ్రీలతో సీఎం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు కీరవాణి బృందంలోని వారు తుది స్వరాలు వినిపించారు. వాటిపై వారిద్దరు సంతృప్తి వ్యక్తం చేశారు. కీరవాణి సహా గాయనీ గాయకులను అభినందించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున వీటిని అధికారికంగా విడుదల చేయనున్నారు. అంతకంటే ముందు.. ఈ గీతాలను, స్వరాలను మంత్రివర్గ సహచరులకు కూడా వినిపించి, వారి ఆమోదం అనంతరం ప్రజాబాహుళ్యంలోకి విడుదల చేయాలని నిర్ణయించారు.
రాష్ట్ర చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కోదండరాం,ఎమ్మెల్యే రాంచంద్రునాయక్, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు
ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం
రాష్ట్ర అధికారిక చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. చిహ్నంలో మార్పులు చేర్పులపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో ఆయన చర్చించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈమేరకు.. చిత్రకారుడు పలు నమూనాలు సిద్ధం చేశారు. ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. వీటిని మంత్రివర్గ సహచరులకు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చూపించి, వారి సలహాలు, సూచనలు కూడా స్వీకరించి.. తుది రూపు ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. దీనిపై గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో వివిధ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ చిహ్నాన్ని కూడా జూన్ 2న ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఐకాస నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, మాజీ ఎంపీ బలరాం నాయక్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.