A strong wind shake the plane: విమానాన్నే కదిలించిన పెనుగాలి!

అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేశాయి. వీటి బీభత్సానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేశాయి. వీటి బీభత్సానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డాలస్ ఫోర్ట్‌వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ బోయింగ్ 737-800 విమానం ఈ గాలి దెబ్బకు కదిలిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ అందులో లేరు. విమానాశ్రయ నిఘా కెమెరాల్లో ఈ దృశ్యం నిక్షిప్తమైంది. మంగళవారం ఉదయం విమానాశ్రయంలో గేట్ సీ-21 వద్ద ఈ ఘటన చోటుచేసుకొంది. ఆ సమయంలో గంటకు దాదాపు 80 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. ఈ దెబ్బకు దాదాపు 202 విమానాలను రద్దు చేయగా.. మరో 500 విమాన సర్వీసుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఇక తుపాను కారణంగా టెక్సాస్‌లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. బేస్‌బాల్ పరిమాణంలో వడగళ్లు పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన వర్షాలతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. దాదాపు 10 లక్షల కుటుంబాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటివరకు టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్, మిస్సోరీ, కెంటకీ, ఉత్తర కరోలీనా, వర్జీనియా రాష్ట్రాల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలి మైనర్ మృతి
హ్యూస్టన్ ప్రాంతంలో వచ్చిన వరదల్లో భారీ సంఖ్యలో కార్లు కొట్టుకుపోయాయి. మూడు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలి 16 ఏళ్ల బాలుడు చనిపోయాడు. తమ రాష్ట్రంలో ఐదుగురు చనిపోయినట్లు కెంటకీ గవర్నర్ ఆండీ బెషెర్ వెల్లడించారు.