Rafah: రఫా నడిబొడ్డుకు ఇజ్రాయెల్

దక్షిణ గాజాలోని రఫా నగరంలోకి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చొచ్చుకొనిపోతున్నాయి. తొలుత శివార్లకే పరిమితమైన ఐడీఎఫ్, ఇప్పుడు నగరం మధ్యలోకి చేరుకుంది.
జెరూసలెం: దక్షిణ గాజాలోని రఫా నగరంలోకి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చొచ్చుకొనిపోతున్నాయి. తొలుత శివార్లకే పరిమితమైన ఐడీఎఫ్, ఇప్పుడు నగరం మధ్యలోకి చేరుకుంది. చాలా ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు సాగుతున్నట్లు ఐడీఎఫ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మందుపాతర పేలి ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు బుధవారం ఐడీఎఫ్ తెలిపింది. మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొంది. రఫాలో పరిమిత యుద్ధం మాత్రమే చేస్తున్నామని ఐడీఎఫ్ చెబుతున్నప్పటికీ దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 10 లక్షల మంది పాలస్తీనా పౌరులు రఫాను వీడారు. వీరంతా నిరాశ్రయులై ఉత్తర, మధ్య గాజా నుంచి రఫాకు తరలి వచ్చిన వారే. అక్టోబరులో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 36 వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అంతర్జాతీయంగానూ ఇజ్రాయెల్ ఒత్తిడి పెరుగుతోంది. టెల్ అవీవ్‌లోని తమ రాయబారిని ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం బ్రెజిల్ ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ముందు నుంచీ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వా విమర్శిస్తూ ఉన్నారు. పాలస్తీనా ప్రజలపై నెతన్యాహు ప్రభుత్వం దాష్టీకం చేస్తోందని ఇటీవల ఆయన పేర్కొన్నారు. దీంతో టెల్ అవీవ్‌లోని బ్రెజిల్ రాయబారిని ఇజ్రాయెల్ ఇటీవల మందలించింది. ఈ నేపథ్యంలోనే రాయబారి ఫ్రెడరికో మేయర్‌ను స్వదేశానికి లూలా రప్పించినట్లు తెలుస్తోంది.
గాజా-ఈజిప్టు సరిహద్దు ఇజ్రాయెల్ నియంత్రణలో
ఈజిప్టు-గాజా సరిహద్దు మొత్తాన్ని ఇజ్రాయెల్ తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈజిప్టును ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాన్ని ఫిలడెల్ఫి కారిడార్ అని పేర్కొంటారు. ఇది దక్షిణ గాజాలోని రఫాలో ఉంటుంది. ఇటీవల రఫా క్రాసింగ్‌ను ఆక్రమించిన ఇజ్రాయెల్.. ఇప్పుడు మొత్తం సరిహద్దు ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడం గమనార్హం. ఈజిప్టు-గాజా సరిహద్దుల్లో భారీస్థాయిలో సొరంగాలు ఉన్నాయి. వీటి ద్వారా హమాస్‌కు ఆయుధాలు అందుతున్నాయని ఇజ్రాయెల్ విశ్వసిస్తోంది.
ఇజ్రాయెల్‌తో మానవాళికే ముప్పు: ఎర్డొగాన్
ఇస్తాంబుల్: ఇజ్రాయెల్‌తో కేవలం పాలస్తీనాకే కాదని, మానవాళికే పెను ప్రమాదం పొంచి ఉందని తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్ అన్నారు. మనుషుల రక్తం తాగడానికి నెతన్యాహు అలవాటుపడిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అమెరికాకు కూడా రక్తం మరకలు అంటుకున్నాయని ఆరోపించారు. అగ్రరాజ్యం కూడా గాజా నరమేధానికి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిపైనా ఎర్డొగాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘సొంత సిబ్బందినే ఐక్యరాజ్యసమితి రక్షించుకోలేకపోతోంది. చేష్టలుడిగి చూస్తోంది. సంస్థ స్ఫూర్తి పూర్తిగా చచ్చిపోయింది’’ అని విమర్శించారు. గాజా విషయంలో ముస్లిం దేశాలు అవలంబిస్తోన్న వైఖరిని తప్పుపట్టారు. ‘‘అందరూ కలిసి ఉమ్మడిగా ఎందుకు ఇజ్రాయెల్‌పై నిర్ణయం తీసుకోవడం లేదు. ఇంకా ఏం జరిగితే స్పందిస్తారు. దేని కోసం నిరీక్షిస్తున్నారు. మనల్ని అల్లా క్షమించడు’’ అని ఎర్డొగాన్ పదునైన వ్యాఖ్యలు చేశారు.