Chiranjeevi: చిరంజీవికి గోల్డెన్ వీసా.. నెట్టింట శుభాకాంక్షల వెల్లువ

అగ్ర కథానాయకుడు చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసా ( UAE Golden Visa)ను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో మెగాస్టార్ చేరారు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇంతకుముందు.. చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్, షారుక్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి, టొవినో థామస్ తదితరులకు ఈ వీసా లభించింది.

సినిమాల విషయాకొస్తే.. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో (Vishwambhara Movie) నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది రూపొందుతోంది. రూ.200 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే హైలైట్ కానున్నాయి. ఇందులో ఐదుగురు హీరోయిన్లు ఉన్నట్లు టాక్. ఇప్పటికే త్రిష, ఆషికా రంగనాథ్‌లను తీసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.