Attack on farmers.. KTR is serious about Congress government : రైతన్నలపైన లాఠీచార్జిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు…

హైదరాబాద్: అదిలాబాద్‌లో రైతన్నలపైన లాఠీచార్జిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు.
‘‘ రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు. రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి సూచన. ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే.
రాష్ట్రంలో రైతన్నల సమస్యలపైన ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలి. రైతన్నలపైన లాఠీచార్జ్ చేసిన అధికారులపైన కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలి. రైతన్నలపైన ప్రభుత్వ దాడులు బిఆర్ఎస్ పార్టీ ఊరుకోదు’’అని కేటీఆర్ మండిపడ్డారు.
‘‘ విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం, ఇది రైతన్నలపైన ప్రభుత్వ దాడి. ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో రాష్ట్ర వ్యవసాయం ముఖ్యంగా రైతన్నల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. రైతన్నలకు కావాల్సిన సాగునీటి నుంచి మొదలుకొని, రైతుబంధు పెట్టుబడి సహాయం వరకు, చివరికి కనీసం విత్తనాలు అందించలేని దుర్మార్గపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మార్పు తెస్తాం, ప్రజా పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతన్నలపైన లాఠీఛార్జ్ పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తామన్న మార్పా?’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.