chandrababu : NTR said that a ruler is a servant : పాలకుడంటే సేవకుడని ఎన్టీఆర్ చాటిచెప్పారు…

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) 101వ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) నివాళులర్పించారు.
అమరావతి: దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
‘‘క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయి. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారు. సంక్షేమంతో పాటే అభివృద్ధి, పాలనా సంస్కరణలకూ బాటలు వేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసి అన్ని వర్గాలకు ఆత్మబంధువు అయ్యారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగుజాతి కీర్తి కిరీటం ఎన్టీఆర్: నారా లోకేశ్
తాత ఎన్టీఆర్ తనకు నిత్యస్ఫూర్తి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తెలుగుజాతి కీర్తి కిరీటం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా అని లోకేశ్ పేర్కొన్నారు.