#Top Stories

Israel-Hamas Conflict: ఈ ఘోరాన్ని ఇకనైనా ఆపండి.. ఇజ్రాయెల్‌పై ఐరాస మండిపాటు

Israel-Hamas Conflict: రఫాలో ఆదివారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి తీవ్ర స్థాయిలో ఖండించింది. ఇప్పటికైనా దీన్ని ఆపేయాలని కోరింది. బందీలను విడుదల చేయాలని హమాస్‌కు సూచించింది.

Israel-Hamas Conflict | న్యూయార్క్‌: రఫాలో ఇజ్రాయెల్ దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్‌ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఘోరాన్ని ఆపాలని తీవ్ర స్వరంతో హెచ్చరించింది.

‘‘మారణహోమం నుంచి ఆశ్రయం కోరుతున్న సామాన్యులపై జరిగిన దాడి ఇది. అనేక మంది మృతికి కారణమైన ఇజ్రాయెల్ (Israel) దుందుడుకు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. గాజాలో అసలు సురక్షిత ప్రాంతమే లేదు. ఈ ఘోరాన్ని వెంటనే ఆపాలి’’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఎక్స్‌ వేదికగా కోరారు.

రఫాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌ భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటి వరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. దాడి జరిగిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతాన్ని సురక్షితమైనదిగా ఇజ్రాయెలే ప్రకటించింది. దీంతో చాలా మంది ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంపైనే దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూస్తుంటే.. ఎంత హెచ్చరించినా ఇజ్రాయెల్‌ యుద్ధరీతిలో మార్పు రావడం లేదనే విషయం స్పష్టమవుతోందని ఐరాస మానవ హక్కుల విభాగం హై కమిషనర్‌ వోల్కర్‌ టర్క్‌ అన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే గాజాలో (Gaza) సురక్షితమైన ప్రాంతమే లేదని వ్యాఖ్యానించారు. సామాన్య పౌరులతో నిండి ఉన్న అలాంటి ప్రాంతంపై దాడి చేసినప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇజ్రాయెల్‌కు తెలుసని పేర్కొన్నారు. వెంటనే కాల్పుల విరమణను పాటించాలని ఇరు పక్షాలకు పిలుపునిచ్చారు. బందీలను తక్షణమే విడుదల చేయాలని హమాస్‌ను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *