KKR-IPL 2024: కేకేఆర్‌కు టైటిల్.. వీళ్ల ఆటను మరిచిపోలేం..!

మెగా లీగ్ ఛాంపియన్‌గా నిలవాలంటే జట్టులోని ప్రతి ఒక్కరూ నాణ్యమైన ప్రదర్శన చేయాలి. కొందరు ఆరంభంలో ఆకట్టుకుంటే.. మరికొందరు కీలక సమయంలో అడుగు ముందుకేస్తారు.
కోల్‌కతా టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా నిలిచింది. మెంటార్ గౌతమ్ గంభీర్ వెనుకుండి.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరే కాకుండా ఈ సీజన్లో మరికొందరి ఆటను గుర్తు చేసుకోవాల్సిందే.
సాల్ట్ – నరైన్ జోడీ..
లీగ్ ప్రారంభం నుంచి హైదరాబాద్ ఓపెనర్ల దూకుడే ఎక్కువగా వినిపించింది. కానీ, తామేం తక్కువ కాదంటూ కేకేఆర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ – సునీల్ నరైన్ జోడీ అదరగొట్టింది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో వీరి నుంచి శుభారంభం దక్కడం గమనార్హం. ప్లేఆఫ్స్‌కు సాల్ట్ దూరమైనా సరే.. అతడి స్థానంలో వచ్చిన గుర్బాజ్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అదరగొట్టాడు. ఈ సీజన్లో నరైన్ ఓపెనర్‌గా 488 పరుగులు చేశాడంటే అతడి ఆట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో 17 వికెట్లు కూడా తీయడంతో అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు వరించింది.
కుర్రాళ్లు తీసిపోలేదు..

ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో రాణిస్తే ప్రపంచమంతా చూస్తుంది. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు అవకాశం ఉంది. అలా జరగాలంటే మొదట భారీ లీగ్‌లో ఛాన్స్ రావాలి. అలాంటి వారిలో వెంకటేశ్ అయ్యర్, రఘువంశి ఉన్నారు. ప్లేఆఫ్స్‌లో అయ్యర్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫైనల్లోనూ 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, లీగ్ స్టేజ్‌లో కొన్ని మ్యాచుల్లోనే అవకాశం దక్కించుకున్న రఘువంశి కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. దిల్లీపై కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
విమర్శలే సోపానాలుగా..

కోల్‌కతా బౌలర్ హర్షిత్ రాణాపై తొలి మ్యాచ్‌లోనే భారీ జరిమానా పడింది. దానికి కారణం హైదరాబాద్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన తర్వాత ‘ఫ్లైయింగ్ కిస్’ ఇచ్చి విమర్శలపాలయ్యాడు. అతడిపై సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ ఎక్కువైంది. కుర్రాడికి ఇంత ఆవేశం అక్కర్లేదని కామెంట్లు వచ్చాయి. అయితే, వాటినే తన విజయానికి మెట్లుగా వాడుకొని హర్షిత్ చెలరేగిపోయాడు. ఆ వికెట్ కేవలం గాలివాటం కాదని నిరూపిస్తూ ఈ సీజన్లో హర్షిత్ 19 వికెట్లు తీశాడు. ఫైనల్లోనూ సన్‌రైజర్స్ ఎదురు కావడంతో ఎదురు దాడి చేస్తుందేమోనని అంతా భావించారు. కానీ, ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం భయపడకుండా కీలక వికెట్లను తీశాడు. హర్షిత్ వేగంగా వేసిన బంతిని ఆడబోయిన నితీశ్ రెడ్డి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా.. స్లో డెలివరీతో డేంజరస్ బ్యాటర్ క్లాసెన్‌ను బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఒత్తిడి సమయంలోనూ సహనం కోల్పోకుండా అతడు ఆడిన తీరు అభినందనీయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
శ్రేయస్ ఆటతోపాటు కెప్టెన్సీ హైలైట్..
మెగా టోర్నీని చూసేవాళ్లకే ఎంత టెన్షన్ ఉంటుందో కదా.. మరి జట్టును నడిపించే వారి పరిస్థితేంటి? అటు సహచరుల్లో ఆత్మవిశ్వాసం నింపడంతోపాటూ తాను కూడా నాణ్యమైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మెంటార్‌గా గంభీర్ కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలడు. మైదానంలో టీమ్‌ను నడిపించే భారం మాత్రం కెప్టెన్ శ్రేయస్‌దే. ఈ విషయంలో 100 శాతం అత్యుత్తమ సారథిగా నిలిచాడు. బ్యాటింగ్‌లోనూ మిడిలార్డర్లో వచ్చే అయ్యర్ 351 పరుగులు చేశాడు. ప్లేఆఫ్స్‌లోని తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కేవలం 24 బంతుల్లోనే 58 పరుగులు రాబట్టి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు అలవోక విజయం అందించాడు. ఇటు ఫైనల్లో బౌలింగ్ మార్పులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసి పట్టు సాధించేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు.