#Cinema

Navdeep: రేవ్‌ పార్టీ.. నా విషయంలో నిరుత్సాహపడ్డారేమో: నవదీప్‌

బెంగళూరు రేవ్‌ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా నటుడు నవదీప్‌ స్పందించారు. ఆయన ఏమన్నారంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల హాట్‌టాపిక్‌గా నిలిచిన బెంగళూరు రేవ్‌ పార్టీకి తాను వెళ్లినట్టు రూమర్స్‌ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని భావిస్తున్నట్టు నటుడు నవదీప్‌ (Navdeep) అన్నారు. ‘ఏంటన్నా. ఈసారి నువ్వు ఫేక్‌ న్యూస్‌లో కనిపించడంలేదు’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు. తన కొత్త సినిమా ‘లవ్‌ మౌళి’ (Love Mouli) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో రేవ్‌ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా ఆయన స్పందించారు. ‘చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే.. మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు’ అంటూ విలేకరి ప్రస్తావించగా.. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ సమాధానాలిచ్చారు. రేవ్‌ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు.

చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పు గురించి మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ టైమ్‌లో ప్రేక్షకులకు ‘ఓటీటీ’ బాగా దగ్గరైంది. ఇంట్లో కూర్చొనే అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు. విజువల్‌ ఫీస్ట్‌ అనిపించే అగ్ర హీరోల సినిమాలు చూసేందుకు తప్ప థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. థియేటర్లలో విడుదలైన రెండు, మూడు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయని ఆడియన్స్‌ భావిస్తున్నారు. మా చిత్రం విషయానికొస్తే.. దాని నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై ఓ సినిమా తీయొచ్చు. చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం’’ అని తెలిపారు. రొమాంటిక్‌ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన ‘లవ్‌ మౌళి’లో భావన సాగి హీరోయిన్‌. ఈ మూవీ జూన్‌ 7న విడుదల కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *