#Trending

ELON MUSK AFFAIR: నాడు మిత్రుడి భార్యతో మస్క్‌కు వివాహేతర సంబంధం!

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్‌ షానన్‌తో ఆయన వివాహేతర బంధం సాగించారని, అందువల్లే సెర్గీ దంపతులు విడిపోయారని న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది.

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్‌ షానన్‌తో ఆయన వివాహేతర బంధం సాగించారని, అందువల్లే సెర్గీ దంపతులు విడిపోయారని న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. 2021లో నికోల్‌ న్యూయార్క్‌లో తన పుట్టినరోజు వేడుకలు ఏర్పాటుచేశారు. ఆ పార్టీకి మస్క్‌ కూడా హాజరయ్యారు. ఆ సమయంలోనే వీరి మధ్య బంధం మొదలైనట్లు సదరు కథనం పేర్కొంది. అదే ఏడాది డిసెంబరులో మయామీలో మస్క్‌ సోదరుడు ఇచ్చిన విందులో నికోల్‌ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరూ కెటమిన్‌ డ్రగ్స్‌ తీసుకున్నారని, కొన్ని గంటల పాటు కనిపించకుండా పోయారని ఆ పార్టీకి వచ్చిన నలుగురు ధ్రువీకరించినట్లు కథనం వెల్లడించింది. మస్క్‌తో తాను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు నికోల్‌ తన భర్త సెర్గీ బ్రిన్, ఇతర కుటుంబసభ్యుల ముందు అంగీకరించారట. ఈ పార్టీ జరిగిన రెండు వారాల తర్వాత నుంచి విడివిడిగా ఉన్న సెర్గీ, నికోల్‌ 2022లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది వీరికి విడాకులు మంజూరయ్యాయి. ప్రస్తుతం నికోల్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ జూనియర్‌కు రన్నింగ్‌ మేట్‌గా పోటీ చేస్తున్నారు. రెండేళ్ల కిందటే మస్క్, నికోల్‌ ఎఫైర్‌ వార్తలు బయటకు రాగా.. వీరిద్దరూ కొట్టిపారేశారు. ఆమెతో తనకు ఎలాంటి బంధం లేదని మస్క్‌ అప్పట్లో ట్వీట్‌ చేశారు. మరోవైపు, ఈ వ్యవహారం కారణంగా మస్క్, సెర్గీ స్నేహబంధం కూడా ముగిసినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ ఒకప్పుడు మంచి మిత్రులు. టెస్లా సంస్థ తయారుచేసిన తొలి కార్లను అందుకున్నవారిలో సెర్గీ కూడా ఒకరు. 2008లో మాంద్యం సమయంలో టెస్లా కార్యకలాపాలు కొనసాగించేందుకు సెర్గీ 5 లక్షల డాలర్లు సాయం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *