Kolkata Vs Hyderabad: సన్‌రైజర్స్ బ్యాటింగే కాదు.. బౌలింగ్‌కూ పదునెక్కువే: గౌతమ్ గంభీర్

ఐపీఎల్ ఫైనల్‌లో ఢీకొట్టబోయే హైదరాబాద్ బలాలపై కోల్‌కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్‌లో కోల్‌కతా – హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచిన సంగతి తెలిసిందే. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఎస్‌ఆర్‌హెచ్ తుది పోరుకు దూసుకొచ్చింది. అన్ని విభాగాల్లో ఆర్‌ఆర్ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో కోల్‌కతా మెంటార్ గౌతమ్ గంభీర్ హైదరాబాద్ బౌలింగ్‌పైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం వారి బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్‌లోనూ పటిష్ఠంగా ఉందని పేర్కొన్నాడు.
‘‘ఈ సీజన్‌లో హైదరాబాద్ బ్యాటర్లు దూకుడుగా ఆడి భారీ స్కోర్లు చేశారు. అలాగని కేవలం వారి బ్యాటింగ్ మాత్రమే బలంగా ఉందని చెప్పడం పొరపాటే అవుతుంది. ఆ జట్టులో భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్.. ఇలా పేస్ దళం ఉంది. కేవలం బ్యాటింగ్‌తోనే ఏ జట్టూ గెలవలేదు. సరైన బౌలింగ్ వనరులు ఉంటేనే మ్యాచ్‌తోపాటు టైటిల్‌ను దక్కించుకొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని తెలిపాడు. ఆదివారం కోల్‌కతా – హైదరాబాద్ జట్ల మధ్య చెపాక్ వేదికగానే ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఆర్సీబీ ఓటమిపై..
ఐపీఎల్ 17వ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా కప్‌ను సొంతం చేసుకోలేకపోయింది. తాజా ఎడిషన్‌లోనూ ప్లేఆఫ్స్‌లో ఓటమిపాలైంది. ఆ జట్టు ఆటతీరుపై గంభీర్ స్పందిస్తూ.. ‘‘ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్భయంగా ఆడేసింది. అదే బెంగళూరుకు ఓటమిని తెచ్చి పెట్టింది. కెప్టెన్‌గా నేను కూడా ఆ ఊపును కొనసాగిస్తే బాగుండేదని చెబుతా. కేవలం ఆ ఒక్క పదం వాడటం ఇటీవల ఎక్కువైంది. అక్కడ మైదానంలో మనమెంత దూకుడుగా ఉన్నామనేదే ముఖ్యం. ఏ జట్టైతే ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతుందో.. వారికే విజయం వరిస్తుంది. అప్పుడు పాయింట్ల టేబుల్‌లో నెంబర్ 1 జట్టుకు నెంబర్ 10 జట్టుకు పెద్దగా తేడా ఉండదు. ఇక్కడ ఏ క్షణంలోనైనా ఎంతటి టీమ్‌కైనా ఓటమి భయం తప్పదు. అందుకే, ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీగా నిలిచింది’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.