#ANDHRA ELECTIONS #Andhra Politics #Elections

Bangalore Rave Party: రేవ్‌ పార్టీలో వైకాపా మూలాలు!

కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న ఏ-2 అరుణ్‌కుమార్‌కు వైకాపా కీలక నేతలతో సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది.

ఈనాడు-చిత్తూరు, కడప, నెల్లూరు: కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న ఏ-2 అరుణ్‌కుమార్‌కు వైకాపా కీలక నేతలతో సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మడవనేరికి చెందిన నిందితుడు మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ అధికారపార్టీ నేతలతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో ఉంటూ వైకాపా కీలక నేతలతో సంబంధాలు ఉండటం వల్లే సీఎం జగన్, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిలతో ఫొటోలు తీయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. బెంగళూరు రేవ్‌ పార్టీ వద్ద ఓ వాహనంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేరిట ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి చెబుతున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలకు నాలుగు స్టిక్కర్లు జారీచేస్తారు. వాటిని తమకు అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకోవడం సహజం.

ఈ కేసులో విజయవాడకు చెందిన బుకీ లంకలపల్లి వాసును పోలీసులు ఏ1గా చేర్చారు. ఏ2 అరుణ్‌కుమార్‌ కావడం.. ఆయనకు అధికారపార్టీతో లింకులు ఉండటం సంచలనమైంది. విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన డి.నాగబాబును ఏ3గా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ ముగ్గురిలో అరుణ్‌కుమార్‌కే వైకాపాతో సంబంధాలు ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. రేవ్‌ పార్టీలో పలు మాదకద్రవ్యాలు వినియోగించారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వ్యాపారం చేసే అరుణ్‌కుమార్‌ను వైకాపా నేతలు తరచూ కలుస్తుంటారు. ఇప్పటికే ఈ కేసులో లంకలపల్లి వాసుతో పాటు అరుణ్‌కుమార్‌ను ఈ నెల 21న బెంగళూరు పోలీసులు అరెస్టుచేసి న్యాయస్థానంలో హాజరుపరచగా పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *