#Top Stories

Nawaz Sharif: Former Pakistan Prime Minister Nawaz Sharif in China.. చైనాలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్..

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చైనాలో పర్యటిస్తున్నారు. సోమవారం బీజింగ్ చేరుకున్న ఆయన.. ఐదు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఇది పూర్తిగా ప్రైవేటు పర్యటనగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. స్థానిక మీడియా వర్గాల సమాచారం మేరకు వైద్య పరీక్షల నిమిత్తం నవాజ్ షరీఫ్ చైనాకు వెళ్తున్నారు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చైనాలో పర్యటిస్తున్నారు. సోమవారం బీజింగ్ చేరుకున్న ఆయన.. ఐదు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఇది పూర్తిగా ప్రైవేటు పర్యటనగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. స్థానిక మీడియా వర్గాల సమాచారం మేరకు వైద్య పరీక్షల నిమిత్తం నవాజ్ షరీఫ్ చైనాకు వెళ్తున్నారు. అలాగే పాకిస్థాన్‌లో పంజాబ్‌ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలకు సంబంధించి చైనాలోని కొన్ని కంపెనీల అధిపతులతో నవాజ్ షరీఫ్ భేటీ అయ్యే అవకాశముంది. పంజాబ్ రాష్ట్రానికి ప్రస్తుతం నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యం నవాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే నవాజ్ షరీఫ్ చేపడుతున్న ఈ ప్రైవేటు పర్యటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నవాజ్ షరీఫ్ పర్యటన అంతర్జాతీయ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. నవాజ్ షరీఫ్ చైనా పర్యటనపై ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.

పాకిస్థాన్ ముస్లీం లీగ్(నవాజ్) వర్గాల సమాచారం మేరకు నవాజ్ షరీఫ్ సోమవారంనాడు లాహోర్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి చైనీస్ సథర్న్ ఎయిర్‌లైన్స్ విమానంలో చైనాకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట మనువడు జునైద్ సఫ్దార్, వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. ఐదు రోజుల పాటు చైనాలో ఆయన పర్యటన కొనసాగుతుంది. అయితే చైనాలో నవాజ్ షరీఫ్ పర్యటనకు సంబంధించి ఇతర వివరాలు వెల్లడించేందుకు పీఎంఎల్-ఎన్ వర్గాలు నిరాకరించాయి. నవాజ్ షరీఫ్‌తో పాటు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ కూడా చైనాలో పర్యటిస్తారని సమాచారం. చైనా అగ్రనేతలు ఎవరితోనానై వారు భేటీ కావచ్చన్న ప్రచారం జరుగుతున్నా.. దీన్ని పీఎంఎల్-ఎన్ వర్గాలు ధృవీకరించడంలేదు.

నవాజ్ షరీఫ్ చైనా పర్యటనపై ఆయన పార్టీ వర్గాల్లోనూ జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రత్యేక పని మీదే ఆయన చైనా పర్యటనకు వెళ్లినట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. చికిత్స కోసం గతంలో ఎప్పుడూ నవాజ్ షరీఫ్ చైనాలో పర్యటించలేదు. ఆరోగ్య కారణాలతో 2019లో బ్రిటన్‌కు వెళ్లిన నవాజ్ షరీఫ్, కొన్నేళ్లు అక్కడే ఉన్నారు. 2023లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాతే ఆయన తన మాతృ దేశంలో అడుగుపెట్టారు. నాలుగోసారి పాక్ ప్రధాని కావాలన్న ఆకాంక్ష ఫిబ్రవరి ఎన్నికల్లో నెరవేరకపోవడంతో నవాజ్ షరీఫ్ రాజకీయంగా యాక్టివ్‌గా లేరు.

చైనా పాలకుల పిలుపుతోనే షరీఫ్ ఆ దేశ పర్యటనకు వెళ్లి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో నవాజ్ షరీఫ్ ప్రైవేటు పర్యటనను భారత్ సహా పలు దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *