#ANDHRA ELECTIONS #Elections

AP Elections Amanchi Krishnamohan.. : కాంగ్రెస్‌లోకి ఆమంచి కృష్ణమోహన్‌.. 

ఆమంచి కృష్ణమోహన్‌ పోటీపై సస్పెన్స్‌ వీడింది. త్వరలో కాంగ్రెస్‌లో చేరి.. చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తిగా మారుతోంది. వైసీపీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తానంటున్నారు ఆయన. రెండు పార్టీలతో వ్యక్తిగత విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అటు.. పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ నేతలు.. మరో పార్టీలో టిక్కెట్లు వెతుక్కుంటున్నారు. దాంతో.. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ నుంచి టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చాన్స్‌ దక్కకపోవడంతో కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. తాజాగా.. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్ళపల్లిలో అనుచరులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు ఆమంచి కృష్ణమోహన్. కాంగ్రెస్ నుంచి చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని అనుచరులు సూచించినట్లు చెప్పారు. అందుకే.. కాంగ్రెస్‌లో చేరి చీరాల నుంచి పోటీ చేయబోతున్నానని టీవీ9 వేదికగా ప్రకటించారు.

ఇక.. వైసీపీకి, టీడీపీకి సమాన దూరం పాటించాలని డిసైడ్‌ అయ్యానన్నారు. వైసీపీ, టీడీపీతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని.. టీడీపీలో చంద్రబాబు, వైసీపీలో వైఎస్ జగన్ ఎంతో గౌరవించారని తెలిపారు. త్వరలోనే ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలను చీరాల బహిరంగ సభకు ఆహ్వానించి కాంగ్రెస్‌లో చేరుతానని స్పష్టం చేశారు ఆమంచి కృష్ణమోహన్. గత ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్‌.. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బలరాం వైసీపీలోకి చేరడంతో ఆమంచిని పర్చూరు ఇన్‌చార్జ్‌గా నియమించారు. అయితే.. పర్చూరు నుంచి పోటీకి ససేమీరా అనడంతో అక్కడ వేరే అభ్యర్థిని ప్రకటించింది వైసీపీ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *