#Sport News

Harry Brooke :  హ్యారీ బ్రూక్‌ విధ్వంసం సృష్టించాడు.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2024లో (డివిజన్‌ 2) భాగంగా లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌, యార్క్‌షైర్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 69 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్‌ 2024 నుంచి తప్పుకున్న తర్వాత బ్రూక్‌ ఆడిన తొలి మ్యాచ్‌ ఇదే.

ప్రస్తుత సీజన్‌ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్రూక్‌ను 4 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల చేత బ్రూక్‌ ప్రస్తుత సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. బ్రూక్‌ స్థానాన్ని డీసీ యాజమాన్యం సౌతాఫ్రికా పేసర్‌ లిజాడ్‌ విలియమ్స్‌తో భర్తీ చేసింది. బ్రూక్‌ ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బ్రూక్‌ ఐపీఎల్‌ నుంచి ఉద్దేశపూర్వకంగానే తప్పుకుని వ్యక్తిగత కారణాలను సాకుగా చూపాడంటూ ప్రచారం జరుగుతుంది.

బ్రూక్‌ను 2023 వేలంలో సన్‌రైజర్స్‌ 13.25 కోట్లకు సొంతం చేసుకోగా.. తాజాగా సీజన్‌లో అతనికి ఆ స్థాయి మొత్తం లభించలేదు. ఈ కారణంగానే బ్రూక్‌ ఐపీఎల్‌ను స్కిప్‌ చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. బ్రూక్‌తో పాటు ఆడమ్‌ లిత్‌ (101) కూడా సెంచరీతో కదంతొక్కడంతో యార్క్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అంతకుముందు లీసెస్టర్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటైంది. మార్కస్‌ హ్యారిస్‌ (56), బెన్‌ మైక్‌ (90), టామ్‌ స్క్రీవెన్‌ (56) అర్దసెంచరీలతో రాణించారు. యార్క్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన తర్వాత లీసెస్టర్‌షైర్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 26/0​ స్కోర్‌ వద్ద భారీ వర్షం కురువడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *