#Telangan Politics #Telangana

Telangana Cm Revanthreddy About Kcr & BRS Party : తెలంగాణ రాష్ట్రాన్ని KCR మొత్తం దోచుకున్నారు

‘గత పదేళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ దొంగల్లా దోచుకున్నారు. కేసీఆర్‌ దశాబ్ద కాలంలో వందేళ్ల విధ్వంసానికి పాల్పడ్డారు’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం
చర్లపల్లి కారాగారానికి పంపిస్తాం
నేను జానారెడ్డిలా కాదు…రేవంత్‌రెడ్డిని
అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు గుణపాఠం చెప్పినట్లే ఇప్పుడు ప్రజలు భాజపాను ఓడించాలి
జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ‘గత పదేళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ దొంగల్లా దోచుకున్నారు. కేసీఆర్‌ దశాబ్ద కాలంలో వందేళ్ల విధ్వంసానికి పాల్పడ్డారు’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తామని హెచ్చరించారు. తెలంగాణకు భాజపా చేసిందేమీ లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో భారాసను ఇంటికి పంపించినట్లే, లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను బొందపెట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో 14 లోక్‌సభ స్థానాలను గెలుచుకునేందుకు కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని కోరారు. తుక్కుగూడలో జరిగిన జనజాతర బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘‘అధికారం పోవడమే కాకుండా కాలు విరిగి కట్టె పట్టుకుని నడుస్తున్నారని కొంతకాలం కేసీఆర్‌ పట్ల మేం సంయమనం పాటించాం. ఆయన కుమార్తె కవిత జైలుకు పోయిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మానవత్వంతో ఉండాలని, ఆయన గురించి మాట్లాడకుండా మర్యాదగా వ్యవహరించాం. కానీ కేసీఆర్‌ ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోం. ఆయన వాడే భాష తీరు ఎలా ఉంటోంది? నేను పెద్దలు జానారెడ్డిలా కాదు…రేవంత్‌రెడ్డిని. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్‌ కట్టించలేదు. కానీ ఆయన కుటుంబంతో సహా కలసి ఉండేందుకు చర్లపల్లి జైలులో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కార్యకర్తలు తీసుకుంటారు.

భాజపాకు ఎందుకు ఓటేయాలి? దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమించిన రైతులను చంపినందుకా? పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ 7.2 లక్షల ఉద్యోగాలే ఇచ్చినందుకా? పదేళ్లు ప్రధానిగా ఉండి ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐఆర్‌ కారిడార్‌, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎందుకు ఇవ్వలేదు? విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయలేదు? ఇందుకోసమే భాజపాకు ఓటు వేయాలా అని కిషన్‌రెడ్డిని అడుగుతున్నా. హైదరాబాద్‌లో నాడు వరదలు వస్తే కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా ఎందుకు తేలేదు?
2022 నాటికల్లా ప్రతి పేదకు ఇల్లు ఇస్తామన్న మోదీ తెలంగాణలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో లెక్క చెప్పి ఓట్లు అడగాలి. మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టి ఇంతవరకూ అధికారం నిలబెట్టుకున్నారు. ఇప్పుడు దక్షిణ, ఉత్తర భారతదేశం అని చిచ్చు పెట్టి ఆయన మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. నమో అంటే నమ్మితే మోసం. అందుకే భారాస మాదిరిగా భాజపాను బొందపెట్టేవరకూ ప్రజలు నిద్రపోవద్దు.

కల్వకుంట్ల కుటుంబం అవినీతి పాలన గురించి మేం మాట్లాడితే, భారాస నాయకుడు కేటీఆర్‌ సోనియాగాంధీ కుటుంబం అని మాట్లాడుతున్నారు. సోనియా, రాహుల్‌గాంధీలు అందివచ్చిన పదవులను కూడా  దేశ ప్రజల కోసం తిరస్కరించారు. యువకుల త్యాగాలతో సాకారమైన రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పులపాలు చేశారు. రేవంత్‌రెడ్డి 12 సార్లు దిల్లీకి వెళ్లారని కేసీఆర్‌ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఆయన వందసార్లు వెళ్తారు. అధినేత సోనియాగాంధీని కలుస్తారు. పదేళ్లుగా ఇక్కడే ఉన్న కేసీఆర్‌ కనీసం మంత్రులను కూడా కలిసిన పాపాన పోలేదు. అడ్డొచ్చినోళ్లను తొక్కుకుంటూ పోతానంటున్న కేసీఆర్‌ను.. మళ్లీ లేవకుండా తెలంగాణ ప్రజలు ఇప్పటికే తొక్కేశారు.

దేశంలో వ్యవస్థలను కాలరాస్తున్న భాజపాపై పోరాటానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని, ప్రజల వెంట మేమున్నామని చెప్పడానికి రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రను నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి.. సామరస్యాన్ని కాపాడటానికి కృషి చేశారు. తెలంగాణకు వచ్చినప్పుడు కులగణన చేపడతామని నాడు ఆయన ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేపట్టింది. రాహుల్‌గాంధీ విడుదల చేసిన 6 గ్యారంటీల్లో ప్రధానమైన అంశాలను ఇప్పటికే అమలు చేశాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *