HYD Metro: మెట్రో ప్రయాణికులకు అదనంగా భారం పడనుంది.

హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు మెట్రో కార్డుపై ఉన్న రాయితీని, హాలీడే కార్డును మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతో, ప్రయాణికులపై అదనంగా భారం పడనుంది.

కాగా, హైదరాబాద్‌వాసులకు మెట్రో రైలు ప్రధాన రవాణా సాధనంగా మారింది. ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో ప్రజలు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో, ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో మెట్రో ప్రయాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు మెట్రో బాటపట్టారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అధికారులు షాకిచ్చారు.

మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేసిన అధికారులు.. రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. దీంతో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా, గతేడాది ఏప్రిల్ కూడా మెట్రో అధికారులు రాయితీలను ఎత్తివేశారు. రద్దీవేళ్లలో డిస్కౌంట్‌ను పూర్తిగా రద్దుచేశారు. తాజాగా మరోసారి అదేవిధానాన్ని అమలుచేస్తున్నారు.