Ajith: వైరల్ స్టంట్ వీడియోపై స్పందించిన అజిత్ టీమ్..

‘విదా ముయార్చి’లో అజిత్ స్టంట్ వీడియోపై ఆయన టీమ్ స్పందించింది. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది.

కోలీవుడ్ హీరో అజిత్ రియల్ స్టంట్ చేసిన వీడియో ఇటీవల వైరలైన విషయం తెలిసిందే. దీనిపై కొందరు అభిమానులు అజిత్ ఇప్పుడెలా ఉన్నారంటూ టీమ్‌ను అడుగుతూ పోస్ట్‌లు పెట్టారు. తాజాగా ఆయన టీమ్ దీనిపై స్పందించింది. ‘నిర్మాణ సంస్థ పంచుకున్న వీడియో గతేడాది నవంబర్ చివరి వారంలో తీసినది. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. హైవేపై యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆయన నడిపిన కారు టైరులో గాలి పూర్తిగా తగ్గిపోవడం వల్ల అది అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ఉన్న అర్నవ్, అజిత్‌లను మూవీ యూనిట్ వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. మూడు గంటల్లోనే తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు’ అని తెలిపింది.

‘విదా ముయార్చి’లోని యాక్షన్ సీక్వెన్స్ కోసం అజిత్ రిస్క్ చేసి డూప్ లేకుండా నటించారు. దీనికి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది. ‘ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో..’ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించింది. అది నెట్టింట తెగ షేర్ అయింది. దీంతో ఆయనకు ప్రమాదం జరిగిందనుకుని అభిమానులు కంగారుపడ్డారు. తాజాగా ఆయన టీమ్ ఇచ్చిన వివరణతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ‘విదా ముయార్చి’లో త్రిష హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత అట్లీ దర్శకత్వంలో అజిత్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అట్లీ ఓ సందర్భంలో దీని గురించి మాట్లాడుతూ.. ‘అజిత్‌కు సరిపోయే స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. దానిపై పూర్తిగా వర్క్ చేయాలి. ఆ స్టోరీ లైన్ గురించి ఆయనకు చెప్పాలని గతంలోనే ప్రయత్నించా. కానీ కుదరలేదు. ఒకవేళ అంగీకరించి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అది సూపర్ హిట్ అవుతుంది. ఆయన రమ్మని పిలవగానే వెళ్లి కథ చెబుతాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఓదార్చారు. చాలా మంచి మనిషి’ అని చెప్పారు. దీంతో త్వరలోనే ఈ కాంబో రావడం ఖాయమంటున్నారు.