TDP CBN : Free sand when our government comes కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక

‘గోదావరిలో ఇసుక ఉంటుంది. పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారు.

భీమవరం: ‘గోదావరిలో ఇసుక ఉంటుంది. పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. తెదేపా హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1000కి ఇస్తే వైకాపా రూ.5వేలు చేసిందని, మిగిలిన రూ.4వేలు ఎవరి జేబులోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. వైకాపా దుర్మార్గపు ఇసుక విధానం వల్ల వేలమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాలకు తగ్గకుండా ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో శుక్రవారం ప్రజాగళం రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించారు. రెండు సభల్లో చంద్రబాబు ప్రసంగించారు.

‘వైకాపా ఫ్యాన్ అరిగిపోయింది. ఇక తిరిగే పరిస్థితిలో లేదు. ప్రజలు ముక్కలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయిదేళ్ల జగన్ పాలనలో యువత జీవితాలు బుగ్గి పాలయ్యాయి. అన్ని వర్గాలూ అణగారిపోయాయి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎన్డీయే ప్రభుత్వం రాగానే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. తెదేపా, ఎన్డీయే ప్రభుత్వం 2014-19లో వైకాపా కంటే మెరుగ్గా 19% సంపదను సంక్షేమ పథకాలకు ఖర్చుచేసిందని గుర్తుచేశారు.

సంక్షోభంలో అన్నదాతలు
‘రాష్ట్రంలో అన్నదాతలు సంక్షోభంలో ఉన్నారు. ఈ ప్రభుత్వం సాగును చంపేసింది.. రైతును నష్టాల్లో ముంచేసింది. కనీసం ధాన్యం సంచులూ ఇవ్వలేని దుర్మార్గపు పాలనలో మనం ఉన్నాం. ధాన్యం అమ్ముకునేందుకు రైతులే దళారులకు సొమ్ములు చెల్లించాల్సిన దారుణాలు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో అనేకం. రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 93% రైతులు అప్పుల పాలయ్యారు. తెదేపా పాలనలో అనేక పథకాలు, రాయితీలు ఇచ్చి ఆదుకున్నాం. యంత్రాలు ఇచ్చి, భూసార పరీక్షలు చేశాం. రుణమాఫీ చేసి బాసటగా నిలబడ్డాం. ఆక్వా రైతుకు ఇచ్చిన విద్యుత్తు రాయితీని గాలికొదిలి యూనిట్‌కి రూ.3 వసూలు చేస్తున్నారు. తెదేపా అధికారంలోకి రాగానే జోన్లతో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.5కే ఇచ్చి రైతులను ఆదుకుంటాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి.. మహా ముదురు. ఏటిగట్ల పనులు నాసిరకంగా చేసి దోచుకున్నారు. మెడికల్ కాలేజీ పేరుతో వ్యాపారం చేశారు. సెంటు పట్టాల పంపిణీలో లంచాలు మేశారు. లేఅవుట్‌కు అనుమతి ఇవ్వాలంటే కప్పం కట్టాల్సిందే. ఆయన అనుమతి లేకుండా పోలీసులు కేసు నమోదు చేయరు. ఈ అక్రమాలన్నీ ఆయనకు నేర్పింది సీఎం జగనే’ అని చంద్రబాబు విమర్శించారు.
నిరుద్యోగంతో యువతకు అవస్థలు: ‘జగన్ పాలనలో ఏ వర్గమూ ఆనందంగా లేదు. యువత నిరుద్యోగ సమస్యతో అవస్థలు పడుతున్నారు. వారికి జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఇస్తానని మోసం చేశారు. ఉన్న పరిశ్రమలు మూతపడేలా చేసి నిరుద్యోగం పెంచారు. తెదేపా అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఆటోడ్రైవర్లూ ఆనందంగా లేరు. 7 లక్షల మంది డ్రైవర్లు ఉంటే 2 లక్షల మందికి ఆర్థికసాయం చేసి మమ అనిపిస్తున్నారు. వైకాపా పాలనలో జగన్ తప్ప బాగుపడినవారు ఎవరూ లేరు’ అంటూ విమర్శించారు.

రహదారులన్నీ బాగుచేస్తాం: ‘నాడు-నేడు పేరుతో నాసిరకం పనులు చేసి జగన్ విద్యావ్యవస్థను నాశనం చేశారు. తెదేపా ప్రభుత్వం యువతకు శాశ్వత ఉపాధి కల్పిస్తుంది. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే పెడతాను. రహదారులన్నీ బాగు చేస్తాం. రైతులను మెరుగైన స్థితిలో నిలిపేందుకు రైతు కార్పొరేషన్ ఏర్పాటుచేస్తాం. తెదేపా పాలనలో క్వార్టర్ రూ.60కి వచ్చేది. ఇప్పుడు రూ.200 వసూలు చేస్తున్నారు. టీ దుకాణాల్లోనూ ఉండే ఆన్‌లైన్ నగదు బదిలీ వ్యవస్థ.. మద్యం దుకాణాల్లో లేదంటే ఆ సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కి వెళుతున్నట్టే కదా. అమరావతిని నాశనం చేశారు. పోలవరం పనులు 72% చేస్తే దాన్ని గోదాట్లో కలిపేశారు’ అంటూ చంద్రబాబు విమర్శించారు.
శ్రావణ మాసంలో టిడ్కో గృహప్రవేశాలు
‘నేను టిడ్కో ఇళ్ల రూపంలో ఒక్కో లబ్ధిదారుకు రూ.20 లక్షల ఆస్తి ఇస్తే.. వాటిని లబ్ధిదారులకు ఇవ్వడానికి జగన్‌కు మనసు రాలేదు. సెంటు పట్టాల్లోనూ దోపిడీ చేశారు. టిడ్కో ఇళ్ల కోసం ఎమ్మెల్యే రామానాయుడు ఎంతో కృషిచేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రావణమాసంలో టిడ్కో గృహప్రవేశాలు చేయిస్తాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాల సామాజికవర్గానికి, ఉమ్మడి పశ్చిమలో మాదిగ సామాజికవర్గానికి ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తాం’ అని చంద్రబాబు తెలిపారు.