America Warning To Israel : ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన అమెరికా..

యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ శుక్రవారం తెలిపింది
జెరూసలెం: యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ శుక్రవారం తెలిపింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన ఎరెజ్ సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. గాజాలో యుద్ధం, మానవతా సాయం అందిస్తున్న సిబ్బందిపై దాడి వంటి విషయాలపై నెతన్యాహు, బైడెన్ గురువారం చర్చించారు. సామాన్య పౌరులు, సహాయక సిబ్బంది రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని బైడెన్ ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు సూచించారు. దీనిపైనే భవిష్యత్తులో తమ సహకారం ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పారు.

మరోవైపు గాజాలోని ఆహర పంపిణీ చేస్తున్న సహాయక సిబ్బందిపై డ్రోన్ దాడి చేసి ఏడుగురి మరణానికి కారణమైన ఇద్దరు సైనికాధికారులను సస్పెండ్ చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. గాజా పౌరులపై ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరును గత కొంతకాలంగా అమెరికా తప్పుపడుతోంది. కాల్పుల విరమణకు అంగీకరించాలని నెతన్యాహుపై ఒత్తిడి చేస్తోంది. గాజాలోకి మానవతా సాయం వెళ్లేలా ఇజ్రాయెల్ చర్యలు చేపట్టడాన్ని అమెరికా విదేశాంగమంత్రి అంటోని బ్లింకెన్ స్వాగతించారు. అయితే ఇది సరిపోదని.. టెల్‌అవీవ్ చేయాల్సింది చాలా ఉందని తెలిపారు.