IPL 2024, GT vs PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 200 అంతకు పైగా లక్ష్యాలను ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. నిన్న గుజరాత్‌పై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో పంజాబ్ కింగ్స్ ఈ రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్లో పంజాబ్ ఇప్పటివరకు ఆరుసార్లు 200 అంతకంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించింది. పంజాబ్ తర్వాత ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు (5) 200 ఆపైచిలుకు లక్ష్యాలను ఛేదించింది.

మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మరో బంతి మిగిలుండగానే విజయవంతంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాహా (11), విజయ్ శంకర్ (8) నిరాశపర్చగా.. కేన్ విలియమ్సన్ (26), సాయి సుదర్శన్ (33) పర్వాదేనిపించారు. ఆఖర్లో రాహుల్ తెవాటియా (8 బంతుల్లో 23 నాటౌట్) గిల్‌తో కలిసి మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 2, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన శాశంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. శశాంక్‌తో పాటు అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) కూడా అద్భుతమై ఇన్నింగ్స్ ఆడాడు. అశుతోష్.. శశాంక్‌తో కలిసి ఏడో వికెట్‌కు మెరుపు వేగంతో 43 పరుగులు సమకూర్చి పంజాబ్‌కు ఊహించని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి పంజాబ్ పాలిట గెలుపు గుర్రంగా మారాడు.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో శశాంక్, అశుతోష్‌తో పాటు ప్రభ్‌సిమ్రన్ (35), బెయిర్‌స్టో (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే తలో వికెట్ దక్కించుకున్నారు.