#Sport News

IPL 2024: Csk VS Sunrisers : HYDERABD సీఎస్‌కేతో తలపడనున్న సన్‌రైజర్స్‌

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 5) బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విధ్వంసం చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోతున్నారు.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్‌ విన్యాసాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రవిస్‌ హెడ్‌, అబిషేక్‌ శర్మ, క్లాసెన్‌ ఊచకోతను మరో సారి చూసేందుకు హైదరాబాద్‌ అభిమానులు తహతమలాడిపోతున్నారు. సన్‌రైజర్స్‌ చివరిసారి ఉప్పల్‌లో ఆడిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేసిన స్కోర్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే భారీ స్కోర్‌గా రిజిస్టర్‌ అయ్యింది. ఇదే మ్యాచ్‌ భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ ముంబై ఇండియన్స్‌ కూడా తీవ్రంగా ప్రతిఘటించింది. ముంబై ఇండియన్స్‌ కూడా సన్‌రైజర్స్‌ తరహాలోనే మెరుపులు మెరిపించింది. అయితే లక్ష్యం పెద్దది కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఉప్పల్‌ పిచ్‌ బ్యాటర్లకు స్వర్గధామంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో మరోసారి భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయమని తెలుస్తుంది.

సన్‌రైజర్స్‌తో పోలిస్తే సీఎస్‌కే బ్యాటింగ్‌ లైనప్‌లో పెద్ద స్టార్లు లేనప్పటికీ మూకుమ్మడిగా రాణించడమే ఆ జట్టు స్పెషల్‌. ఈ సీజన్‌లో కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ నేతృత్వంలో ఆ జట్టు మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. సీఎస్‌కే బ్యాటింగ్‌లో వ్యక్తిగతమై భారీ ప్రదర్శనలు లేనప్పటికీ రుతురాజ్‌, రచిన్‌, రహానే, డారిల్‌ మిచెల్‌, శివమ్‌ దూబే తలో చేయి వేస్తూ మ్యాచ్‌లను గెలిపిస్తున్నారు.

వైజాగ్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోని పాత రోజులను గుర్తు చేయడం సీఎస్‌కేకు అదనపు బలంగా మారనుంది. అయితే ధోని నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందిగ్దంగా మారింది. ధోని ప్రాక్టీస్‌ సెషన్‌లో ఎక్కడా కనిపించకపోవడంతో అతను నేటి మ్యాచ్‌కు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగతుంది. ధోని విషయం ఏమో కాని నేటి మ్యాచ్‌కు ఫామ్‌లో ఉన్న పేసర్‌ ముస్తాపిజుర్‌ రెహ్మాన్‌ దూరం కానున్నాడు.

వరల్డ్‌కప్‌ వీసా కోసం అతను యూఎస్‌ఏకు వెళ్లాడు. బలాబలాల విషయంలో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయని చెప్పలేం కాని.. కలిసికట్టుగా ఆడితే సీఎస్‌కేకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. ఒకవేళ సన్‌రైజర్స్‌ బ్యాటర్లు గత మ్యాచ్‌ తరహాలో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడితే ఆ జట్టుకే గెలిచే ఛాన్స్‌లు అధికంగా ఉంటాయి. ఏదిఏమైనా హైదరాబాద్‌ అభిమానులకు నేటి మ్యాచ్‌ కనువిందు చేయడం ఖాయం.

హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు జరగ్గా సీఎస్‌కే స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. ఈ జట్టు 15 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. సన్‌రైజర్స్‌ కేవలం 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

తుది జట్లు (అంచనా)..

సీఎస్‌కే: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, డారిల్ మిచెల్, మొయిన్‌ అలీ, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ/ అరవెల్లి అవనీశ్‌, దీపక్ చాహర్, మతీషా పతిరణ

సన్‌రైజర్స్‌: మయాంక్ అగర్వాల్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *