Ajith hero who proved that : ధైర్యానికి హద్దులుండవని నిరూపించిన హీరో


యాక్షన్ సినిమాలంటేనే ఎంతో రిస్క్‌తో కూడుకున్నవి. ఇలాంటి యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా స్వయంగా హీరోలే బరిలోకి దిగడం చాలా అరుదు. కానీ.. తమిళ కథానాయకుడు అజిత్ దీనికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి. సినీప్రియుల్ని మెప్పించడానికి ఎంతటి సాహసాలకైనా వెనకాడరు. స్టంట్స్ చేయడంపై ఎప్పుడూ ఆసక్తి చూపించే అజిత్.. పలు చిత్రాల్లో డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించి ప్రమాదాలకు గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ‘విదా ముయార్చి’ కోసం మరోసారి అలాంటి సాహసాలనే చేశారాయన. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ గతేడాది జరిగింది.

ఇందులో భాగంగానే అజిత్ డూప్ లేకుండా నటించడంతో ప్రమాదానికి గురయ్యారు. చాన్నాళ్ల తర్వాత ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఎక్స్ వేదికగా ‘ధైర్యానికి హద్దులుండవని నిరూపించిన హీరో’ అనే వ్యాఖ్యలతో పంచుకుంది. ఈ సన్నివేశంలో తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడటానికి అజిత్ కారును వేగంగా నడపాలి. ఇందులో డూప్ లేకుండా స్వయంగా ఆయనే కారును డ్రైవ్ చేశారు. దీంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన సాహసాలను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.