Kejriwal’s routine in Tihad Jail : తిహాడ్ జైల్లో కేజ్రీవాల్ దినచర్య

తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కువ సమయాన్ని పుస్తక పఠనానికి, యోగా, ధ్యానాలకు ఉపయోగించుకుంటున్నారు.
దిల్లీ: తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కువ సమయాన్ని పుస్తక పఠనానికి, యోగా, ధ్యానాలకు ఉపయోగించుకుంటున్నారు. రోజులో రెండుసార్లు గంటన్నరసేపు చొప్పున ధ్యానం, యోగా చేస్తున్నారు. ‘నిబంధనల ప్రకారం, అందరి ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్‌కు తన సెల్‌ను శుభ్రం చేసుకునేందుకు ఒక చీపురు, బకెట్ అందించాం. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఒక టేబుల్, కుర్చీ, విద్యుత్తు కెటిల్ కూడా అందుబాటులో ఉంచాం. సెల్లో అమర్చిన రెండు సీసీ కెమెరాలతో ఆయన్ను 24 గంటలూ జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సెల్ బయట ఉన్న చిన్న లాబీలో నడిచేందుకు వెసులుబాటు ఉంది’ అని వివరించాయి. భద్రతా కారణాల వల్ల తోటి ఖైదీలతో కలిసేందుకు ఆయన్ని అనుమతించడం లేదని సమాచారం.

ప్రజాసమస్యల పరిష్కారానికి ఆదేశం
ఎమ్మెల్యేలంతా వారివారి నియోజకవర్గాలను సందర్శించి, సమస్యల్ని పరిష్కరించాలని కేజ్రీవాల్ ఆదేశించారు. జైలు నుంచి ప్రజాప్రతినిధులకు పంపిన ఈ వినతిని ఆయన భార్య సునీత ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. తన న్యాయవాదితో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం పరిశీలించనుంది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన మరో ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్)ను విచారణకు స్వీకరించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా వేసిన పిల్‌ను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడాతో కూడిన ధర్మాసనం గురువారం కొట్టేసింది.