#Top Stories

Israel:  America warned.. Israel came down!Israel:  హెచ్చరించిన అమెరికా.. దిగొచ్చిన ఇజ్రాయెల్‌!

Israel: గాజాలోకి మరింత మానవతా సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇజ్రాయెల్‌కు అమెరికా తేల్చి చెప్పింది. లేదంటే భవిష్యత్తులో తమ సాయం నిలిపివేస్తామని హెచ్చరించింది.

జెరూసలెం: యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ మేరకు ప్రణాళికలను వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం రావడం గమనార్హం.

గాజాలో యుద్ధం, మానవతా సాయం అందిస్తున్న సిబ్బందిపై దాడి వంటి విషయాలపై నెతన్యాహు, బైడెన్ గురువారం చర్చించారు. సామాన్య పౌరులు, సహాయక సిబ్బంది రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని బైడెన్ ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు సూచించారు. దీనిపైనే భవిష్యత్తులో తమ సహకారం ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పారు.

గాజాలో ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తున్న తీరును గతకొంతకాలంగా అమెరికా విమర్శిస్తోంది. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని సూచిస్తోంది. సైనిక సహాయం, దౌత్యపరమైన మద్దతును మాత్రం కొనసాగిస్తూనే ఉంది.  గాజాలో ఆహారం పంపిణీ చేస్తున్న సహాయ సిబ్బందిపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత అంతర్జాతీయ సమాజం నుంచి నెతన్యాహు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు ఉత్తర గాజాలోని ప్రజలంతా ఆకలి చావులకు దగ్గరలో ఉన్నారని ఐరాస ఇటీవల హెచ్చరించింది. మారణహోమానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది. కాల్పుల విరమణ కోసం ఐరాస భద్రతా మండలి చట్టబద్ధమైన డిమాండ్‌ నోటీసును జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *