#Mayank Yadav: ఐపీఎల్ హిస్టరీలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా మయాంక్ సంచలన రికార్డు

మయాంక్ యాదవ్.. 21 ఏళ్ల ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లోకి ఓ బుల్లెట్‌లా దూసుకువచ్చాడు. అరంగేట్రంలోనే తన స్పీడ్ పవర్‌తో సత్తా చాటిన ఈ యువ ఫాస్ట్ బౌలర్.. రెండో మ్యాచ్‌లోనూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
తన పేస్ పదునుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లకు చెమటలు పట్టించిన మయాంక్.. లక్నోను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన స్పెల్(3/14)తో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ యంగ్ స్పీడ్ గన్.
తద్వారా వరుసగా రెండోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ అందుకున్నాడు మయాంక్ యాదవ్. ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ సంచలన డెలివరీతో మెరిశాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ వేసిన మయాంక్.. రెండో బంతిని గంటకు 156.7 కిలో మీటర్ల వేగంతో సంధించాడు.
క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లోనే అది ఫాస్టెస్ట్ డెలివరీ కావడం విశేషం. ఇక పదో ఓవర్ వేసిన మయాంక్ బౌలింగ్‌లో రెండో బాల్ స్పీడ్ కూడా 155.3KMPHగా నమోదైంది. ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన మయాంక్.. ఆ మ్యాచ్‌లో 155.8 KMPH వేగంతో బంతిని విసిరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడుసార్లు 155 KMPH స్పీడ్‌తో బౌలింగ్ చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు మొత్తంగా 48 బంతులు మాత్రమే వేసి ఈ ఘనత సాధించడం విశేషం.
ఇక కశ్మీర్ ఎక్స్‌ప్రెస్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే రెండుసార్లు గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు.
ఇక ఓవరాల్‌గా ఐపీఎల్ ఫాస్టెస్ట్ డెలివరీల విషయానికి వస్తే.. మయాంక్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్-2011లో షాన్ టైట్ 157.7 KMPH వేగంతో బౌలింగ్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఐపీఎల్‌లో గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన టాప్-5 బౌలర్లు
1. షాన్ టైట్- 157.7 KMPH
2. లాకీ ఫెర్గూసన్- 157.3 KMPH
3. ఉమ్రాన్ మాలిక్- 157 KMPH
4. మయాంక్ యాదవ్- 156.7 KMPH
5. అన్రిచ్ నోర్జే- 156.2 KMPH.