Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ

ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టేందుకే నిందితులంతా కూడబలుక్కొని కుట్ర పన్నారని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ రూపొందించారని, ఇది అధికార దుర్వినియోగం కిందికే వస్తుందన్నారు.
హైదరాబాద్: ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టేందుకే నిందితులంతా కూడబలుక్కొని కుట్ర పన్నారని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ రూపొందించారని, ఇది అధికార దుర్వినియోగం కిందికే వస్తుందన్నారు. తర్వాత ఆధారాలు మాయం చేయడంతో పాటు హార్డ్‌డిస్కుల వంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, అందుకే నిందితులను అరెస్టు చేశామని విన్నవించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో గత నెల 23న భుజంగరావు, తిరుపతన్నలను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మర్నాడు న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. దీనికి సంబంధించిన రిమాండు రిపోర్టు ‘ఈనాడు’ చేతికి చిక్కింది. ప్రణీత్‌రావుతో కలిసి వీరిద్దరూ ప్రైవేటు వ్యక్తులపై నిఘా పెట్టినట్లు అంగీకరించారని అందులో పేర్కొన్నారు.

నదిలో.. కార్యాలయంలో ఆధారాలు
గత ఏడాది డిసెంబరు 4న నాగోల్‌లోని మూసీ వంతెన వద్ద హార్డ్‌డిస్కులను నదిలో వేసినట్లు ఈ కేసులో తొలుత అరెస్టయిన ప్రణీత్‌రావు మార్చి 21న అంగీకరించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆయన చెప్పిన చోట వెతికి పదుల సంఖ్యలో ధ్వంసమైన హార్డ్‌డిస్క్‌లు(కొన్ని యంత్రంతో కత్తిరించి ఉన్నాయి) నీటి అడుగు నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. మార్చి 22న ప్రణీత్‌రావును స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) కార్యాలయానికి తీసుకెళ్లామని అక్కడ 12 ఆల్‌ఇన్‌వన్ సిస్టమ్స్, ఏడు సీపీయూలు, ఒక ల్యాప్‌టాప్, ఒక మానిటర్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. హార్డ్‌డిస్కులను కత్తిరించినప్పుడు తెల్లటి అల్యూమినియం పొడి పడిందని దాన్ని ఎలక్ట్రీషియన్ గదిలో గుర్తించి సేకరించినట్లు వివరించారు. ఎస్‌ఐబీ కార్యాలయం వెనక కొన్ని దస్త్రాలు దహనం చేసినట్లు ఆయన చెప్పగా అక్కడ కాలిపోగా మిగిలిన స్పైరల్ బైండింగ్ పుస్తకం, కొన్ని ధ్రువపత్రాలతోపాటు సీసీ టీవీ దృశ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పొందుపరిచారు. ఎస్‌ఐబీలో పనిచేస్తున్న కొత్త నరేష్‌గౌడ్ అనే ఉద్యోగిని విచారించినప్పుడు తోటి సిబ్బందితో కలిసి ఎన్నికలప్పుడు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, వారి అనుచరుల డబ్బు రవాణాపై నిఘా పెట్టి దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకునేలా చూశామని అంగీకరించినట్లు రిమాండు రిపోర్టులో తెలిపారు.
ముగిసిన నిందితుల కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల ఐదు రోజుల పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది. దాంతో వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో గత నెల 23న వీరిద్దర్నీ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి దర్యాప్తులో భాగంగా న్యాయస్థానం అనుమతితో 5 రోజుల విచారణకు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో వీరి పాత్రపై ఆరా తీశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫోన్ ట్యాపింగ్‌లో భుజంగరావు కీలకపాత్ర పోషించగా, డబ్బు తరలింపులో తిరుపతన్న ప్రమేయం ఉందని.. ఇదే విషయాన్ని వీరిద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోంది. విచారణలో ప్రధానంగా ఎవరి ప్రోద్బలంతో ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఆ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు అన్న వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు డబ్బు చేరవేతలోనూ వీరు చురుగ్గా పాల్గొన్నట్లు దర్యాప్తులో వెల్లడి కాగా ఆ నగదు ఎక్కడ నుంచి తెచ్చారు? ఎలా సరఫరా చేశారు? ఎవరికి ముట్టజెప్పారు? ఇందుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారన్న కోణంలోనూ విచారించినట్లు తెలుస్తోంది. వీరి విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.